యంగ్ టైగర్ కి ‘సైకిల్’ పగ్గాలు ?

తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ లేదా బ్రహ్మణి.. ఎవరో ఒకరికి తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేతలు తాజాగా తెలంగాణ తెలుగుదేశం సమావేశంలో చంద్రబాబు ముందుకి ఈ అంశాన్ని తీసుకువచ్చారు.

టాప్ హీరో నందమూరి తారక రామారావు మనవడు హరికృష్ణ కొడుకు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టీటీడీపీ బాధ్యతలను అప్పగించాలని సీఎం చంద్రబాబునాయుడు ముందే పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.

తెలంగాణలో పార్టీనాయకత్వ బాధ్యతలను సినీ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు కానీ, బాబు కోడలు, బాలయ్య కూతురు అయిన బ్రహ్మణికి గానీ అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈ డిమాండ్ పట్ల బాబు ఎలా స్పందించారనేది ఆసక్తిదాయకం.
Chandra Babu Nayudu
కార్యకర్తల డిమాండ్ పై బాబు స్పందిస్తూ.. పార్టీకి దూరదూరంగా మెలుగుతున్న తారక్ కు తెలంగాణ బాధ్యతలు ఇస్తానన్నారా? లేక కోడలు బ్రహ్మణిని ప్రత్యక్ష రాజకీయాల వైపు తీసుకొస్తానన్నారా? అంటే.. ఈ డిమాండ్ పట్ల బాబు తనదైన రీతిలో స్పందించారని చెప్పాలి.

‘తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి డిమాండ్లు రావడం సహజమే..’ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆ డిమాండ్ పట్ల అంతకు మించి స్పందించలేదు. ‘తారక్ లేదా బ్రహ్మణి.. ’ అనే డిమాండ్ పట్ల ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు తెలుగుదేశం అధినేత.

దీన్ని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయంలోకి నారా లేదా నందమూరి కుటుంబీకులను దించే ఆసక్తి చంద్రబాబుకు లేదని స్పష్టం అవుతోంది.

Related Post