Politics

రాములమ్మ రీ ఎంట్రీ… కండిషన్స్ అప్లయ్… జరిగే పనేనా?

విజయశాంతి అనగానే ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మన కళ్ళముందు మెదులుతుంది. కృష్ణ, శోభన్ బాబు,చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరితో నటించడమే కాకుండా,లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో లేడీ అమితాబ్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లో అడుగుపెట్టి బీజేపీలో చేరి, ఆతర్వాత టి ఆర్ ఎస్ లోకి వెళ్లిన విజయశాంతి , ఆ మధ్య కాంగ్రెస్ వైపు చేరింది. అయితే చురుగ్గా కనిపించని విజయశాంతి ఈమధ్య మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సందర్బంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. ఈనేపధ్యంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కాంగ్రెస్ ని షేక్ చేస్తున్నాయి.

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి తన వైఖరి ఏమిటో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట. సీనియర్లను,సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ప్రచార కమిటీని నియమించాలని చెప్పారట. దామోదరం రాజనరసింహ,డీకే అరుణ, మధు యాష్కీ,కోమటి రెడ్డి వెంకట రెడ్డి లతో పాటు ఆమె పేరును కూడా జోడించి తెలంగాణా ప్రచార కమిటీ వేయాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారట.

అయితే ఇప్పటికే టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీనియర్స్ పై పూర్తి భారం మోపింది. వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. ఈదశలో విజయశాంతి ప్రతిపాదనను అసలు పట్టించుకునే స్థితిలో లేదని అంటున్నారు. నాలుగు ఏళ్లుగా సైలెంట్ గా ఉంటున్న విజయశాంతి సలహాలు మానేసి,అందరితో కల్సి పనిచేస్తే బాగుంటుందని, అంతేకాని మధ్యలో వచ్చి పగ్గాలు అప్పగించమంటే కుదిరేపని కాదని కొందరు కాంగ్రెస్ నేతలు స్పష్టంచేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో రాములమ్మ ఏమి చేస్తుందో వేచి చూడాలి.