Politics

తెలంగాణ లోకసభ ఎన్నికలకు జనసేన రెడీ… ప్లాన్ మారిందా?

ఎన్నికలన్నాక రాజకీయ పార్టీలకు కొన్ని వ్యూహాలుంటాయి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెల్సి ఉండాలి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు భోగట్టా. ఏపీలో అన్ని శాసన సభ,లోకసభ సీట్లకు అభ్యర్థులను రంగంలో దింపాలని భావిస్తున్నాడు. అంతేకాకుండా మొన్నటి తెలంగాణా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ లోకసభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసే ఉద్దేశ్యం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణా పార్లమెంటరీ కమిటీలను ప్రకటించడమే జనసేన వ్యూహంలో భాగంగా వినిపించే మాట. ఏపార్టీతో కూడా పొత్తులేకుండా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు భోగట్టా. అయితే ఏపీ తో పాటు తెలంగాణలో కూడా వామపక్షాలతో పొత్తుకు దిగాలన్న యోచన చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. ఎందుకంటే రెండుమూడు చోట్ల వామపక్షాలకు పట్టుండడంతో వాటిని వదిలేసి,మిగిలిన సీట్లలో జనసేన పోటీచేయాలని భావిస్తున్నట్లు కొందరి వాదన.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన లోకసభ ఎన్నికలపై దృష్టి పెట్టడం నిజంగానే హాట్ టాపిక్ అయింది.ఇప్పటికే సికింద్రాబాద్,మల్కాజ్ గిరి,ఖమ్మం ఈ మూడు లోకసభ స్థానాలకు ఇన్ ఛార్జ్ లతో పాటు కమిటీలను కూడా నియమించారు. అంతటితో ఆగకుండా మరిన్ని స్థానాలకు కమిటీల నియామకం గురించి జోరుగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వరంగల్,భువనగిరి,నిజామాబాద్,నల్గొండ, మెదక్,చేవెళ్ల,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించడానికి కసరత్తు మొదలుపెట్టారట.