టిడిపి ప్రచారానికి తారక్ వస్తున్నాడా…. టీడీపీ స్టార్ కాంపేనియర్ ఎవరు?
రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎలాగైనా మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని అధికార టిడిపి వ్యూహాలతో ముందుకు వెళ్తుంటే,ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే టిడిపి,వైస్సార్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తిచేశాయి. ఎన్నికల ప్రచారానికి ఓవైపు టిడిపి అధినేత ,సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టగా, మరోవైపు వైస్సార్ సిపి అధినేత జగన్ కూడా ప్రచారం మొదలెట్టేసారు. వాడీవేడీ మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరపున అభ్యర్థులను ప్రకటిస్తూ దూసుకెళ్తున్నారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ వార్షిక వేడుకను కూడా నిర్వహించారు.
ఇక సినీ స్టార్స్ ని కూడా ప్రచారానికి రంగంలో దించడానికి కూడా ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తోంది. ఎందుకంటే 2009ఎన్నికల్లో విస్తృతంగా రాష్ట్రంలో ప్రచారం చేసి ,టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపిన తారక్ మళ్ళీ 2014ఎన్నికల్లో కనించలేదు. పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితం అయిపోయాడు.
ఎందుకంటే తెలంగాణలో టిడిపి బలపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కి బాధ్యతలు అప్పగిస్తే,కాబోయే తెలంగాణా సీఎం జూనియర్ ఎన్టీఆర్ అవుతారని తెలంగాణా టిడిపి ఎమ్మెల్యే నాగేశ్వర రావు అన్నారు. అయితే 2014లో టిడిపి,బిజెపి పొత్తు కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మద్దతు ప్రకటిస్తూ రెండు పార్టీల తరపున ప్రచారం సాగించారు. ఇక ఇప్పుడు పవన్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతున్నాడు. ఇప్పటికే ఉదృతంగా ప్రచారం సాగిస్తున్నారు.
తన మాటల తూటాలతో టిడిపిని,చంద్రబాబుని అలాగే వైసిపిని,జగన్ ని ఇరుకున పెడుతున్నారు. అందుకే టిడిపి కి స్టార్ కాంపైనర్ ఎవరు అనే ప్రశ్న వస్తోంది. హాట్ టాపిక్ గా మారిన ఈ అంశం నేపథ్యంలో మళ్ళీ తారక్ మంత్రమే వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు టిడిపి ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ ని కల్సి టిడిపి మీద సాగుతున్న దాడిని తిప్పి కొట్టేలా సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కి కౌంటర్ గా ట్విట్టర్ లో కామెంట్ అయినా పెట్టాలని కోరారట.
అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ కారణంగా ఖాళీలేదని, సినిమాలు తప్ప ప్రస్తుతానికి మరోప్రపంచం లేదని తప్పించుకుంటున్నాడని కూడా టాక్ వస్తోంది. హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య , తారక్ దగ్గరవ్వడం నేపథ్యంలో ఈసారి స్టార్ కాంపైన్ కి జూనియర్ వస్తాడా రాడా అనేది వేచిచూడాలి.