Movies

ధనరాజ్ గురించి తెలియని నిజాలు….ఈ మధ్య ధన్ రాజ్ ఎక్కడ కనపడటం లేదు… ఎందుకో?

చిన్నప్పుడు సినిమా పోస్టర్స్ చూస్తూ తాను కూడా సినిమాల్లో చేరి పోస్టర్ లో కనపడాలని ఆశించిన ధనరాజ్ నిజంగానే సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఆడియన్స్ ని నవ్విస్తూ బాగా కనెక్ట్ అయ్యాడు. నిర్మాత గా మారి నష్టపోయాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కు చెందిన సత్యరాజ్,కమలమ్మ దంపతులకు ధనరాజ్ జన్మించాడు. తండ్రి లారీ నడిపేవాడు. వీరిది ప్రేమ వివాహం. అయితే ధనరాజ్ రెండేళ్ల ప్రాయంలో ఉండగా తండ్రి లారీ కింద పడి చనిపోయాడు. దీంతో తల్లి తో కల్సి అమ్మమ్మ ఊరు కృష్ణాజిల్లాకు వెళ్ళాడు. అక్కడే పదవతరగతి వరకూ చదివాడు. సినిమాల్లో నటించాలన్న కోరికతో హైద్రాబాద్ వచ్చిన ధనరాజ్ హీరోల ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే వాచ్ మేన్స్ కనీసం లోపలకు వెళ్లనిచ్చేవారు కాదట.

దీంతో జీవనం కోసం హోటల్ లో సర్వర్ గా పనిచేస్తూ,మరోవైపు సినీ ఛాన్స్ ల కోసం ప్రయత్నించాడు. ఇలా సినీ ఛాన్స్ ల కోసం తిరుగుతున్న సమయంలో విజయ్ అనే డాన్స్ మాస్టర్ పరిచయం కావడం, అతడి డాన్సింగ్ స్కూల్ పనికి కుదరడం జరిగాయి. ఈవిధంగా డాన్స్ స్కూల్లో చేస్తూనే కొందరి ఇళ్లకు వెళ్లి డాన్స్ నేర్పిస్తూ డబ్బులు సంపాదించేవాడు. మొత్తానికి పరిచయాలు పెరగడంతో శివాజీ రాజా నటించిన పట్టుకో అనే మూవీలో చిన్నపాత్ర వేసాడు. అయితే ఆ మూవీ రిలీజ్ కాలేదు.

ఇక హైదరాబాద్ వచ్చిన కొత్తలో తల్లి కూడా అతనితో వచ్చింది. ఆమెకు కేన్సర్ సోకి మరణించడంతో చేతిలో చిల్లి గవ్వలేదు. ఇక అప్పటికే తాను ప్రేమిస్తున్న శిరీష అనే ఆమ్మాయికి ఫోన్ చేయడంతో ఆమె ఇచ్చిన చెవి కమ్మలు,గొలుసు ఇవ్వడంతో,తల్లికి దహన సంస్కారాలు చేసాడు. తరువాత శిరీష కు పెళ్లి ప్రపోజల్ చేసిన ధనరాజ్ లోని నిజాయితీ నచ్చి అంగీకరించడంతో తల్లి పోయిన మూడే రోజే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఇక జై సినిమాలో ఛాన్స్ కోసం పేపర్ ప్రకటన చూసి వెళ్ళాడు. అయితే అక్కడ 1000మంది ఆడిషన్స్ కి వచ్చారు. అయితే ధనరాజ్ కి ఛాన్స్ వచ్చింది.

ఇందులో పేరు రాలేదు. అయితే జగడం మూవీతో దశ తిరిగింది. బన్నీ నటించిన పరుగు మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు. గోపి గోపిక,గోదావరి వంటి సినిమాల్లో వరుస ఛాన్స్ లు వచ్చాయి. ఇక తాగుబోతు ధనరాజ్ తో కల్సి ఏకేరావు, పీకేరావు సినిమా లీడ్ పాత్రల్లో చేసినా, ఈ సినిమా వచ్చినట్టే ఎవరికీ తెలీదు. దళం,అడ్డా, భీమిలి కబడ్డీ జట్టు, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, అహ నా పెళ్ళంట,ప్రియతమా నీవే చెప్పు,వంటి సినిమాల్లో ధనరాజ్ నటించి ఆర్ధికంగా నిలదొక్కుకున్నాడు. ఇక అదే సమయంలో జబర్దస్త్ లో ఛాన్స్ రావడంతో బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్ధ్ ని అనుకరిస్తూ చేసిన నటన మంచి పేరు తెచ్చింది.

పంచ్ డైలాగులతో జబర్దస్త్ ప్రోగ్రాం లో అదరగొట్టాడు. అలాగే ధనాధన్ ధనరాజ్ గా టీమ్ లీడర్ అయ్యాడు. ఇక పిల్ల జమీందార్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వర్షం సాక్షిగా, గబ్బర్ సింగ్,హృదయం ఎక్కడ ఉంది వంటి ఎన్నో సినిమాల్లో చేసాడు. ఓ చచ్చినోడి ప్రేమకథ పేరిట హీరోగా నటిస్తూ సాయి అచ్యుత్ డైరెక్షన్ లో మొదలు పెట్టిన సినిమా ఆర్ధిక సమస్యలతో కొద్దిరోజులకు ఆగిపోయింది. ఇక తానే ప్రొడ్యూసర్ గా మారి ధనలక్ష్మి తలుపుతడితే మూవీ ని సాయి అచ్యుత్ డైరెక్షన్ లో తీసాడు.

రామ సత్యనారాయణ, అమెరికాలో ఉండే ప్రసాద్,ప్రతాప్ వంటి వాళ్ళు ఈసినిమా నిర్మాణంలో భాగం పంచుకున్నారు. కానీ ఈ మూవీ జనానికి రుచించలేదు. అయితే 50లక్షలు నష్టపోవడంతో ఇక సినిమాలు తీయమని భార్యకు మాటిచ్చి యాక్టింగ్ పైనే దృష్టి పెట్టాడు. బంతిపూల జానకి అనే మూవీలో హీరోగా వేసాడు. పిలవని పేరంటం మూవీలో మంచు లక్ష్మి సరసన నటించాడు. అవి క్లిక్ కాలేదు. తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు ,భాగమతి వంటి సినిమాల్లో నటించాడు. బిగ్ బాస్ లో 14 రోజులపాటు ఉండి ఎలిమినేట్ అయ్యాడు.