షూటింగ్స్ లో స్టార్లకు గాయాల బెడద… అజాగ్రత్తే కారణమా….???

సినిమా షూటింగ్స్ లో నటులకు గాయాలైతే దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఫాన్స్ లో ఆందోళన ఎలాగు ఉంటుంది. షూటింగ్ జాప్యం,ఫలితంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం,ఇక ఇన్ టైమ్ లో సినిమా రిలీజ్ కాక, దాని ప్రభావం ప్రొడక్షన్ పైనా పడడం వంటివి చోటుచేసుకుంటాయి. మానసికంగానూ అది దర్శకనిర్మాతలకు సెట్ బ్యాక్ అవుతుంది. కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని వెదజల్లి ఆడే జూదంలో ఇలాంటివి చాలా చాలా ఇబ్బందికరమని పలువురు విశ్లేషిస్తున్నారు. అందునా ఈ మధ్య తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. తాజాగా ఎస్.ఎస్.రాజమౌళి తరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ ఫిక్షన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఇరువురు స్టార్ హీరోలకు గాయాలయ్యాయి. ముందుగా రామ్ చరణ్ కి గాయం వల్ల షెడ్యూల్ ని వాయిదా వేశారు. చరణ్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్స్ లోకి రీజాయిన్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్ కి గాయం అవ్వడంతో మళ్ళీ అదే పరిస్థితి. తారక్ కూడా గాయాల నుంచి కోలుకుని తిరిగి సెట్స్ లోకి జాయిన్ అయ్యారు. 

ఈ ఘటనలను బట్టి స్టార్స్ కి ప్రమాదం జరిగితే అందుకు తగ్గ ప్లాన్ కూడా దర్శకనిర్మాతలకు ముందస్తుగా ఉండాలని తెలిసేలా చేసిందని అంటున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఆర్థికంగానూ భారమే కదా. ఇక ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండో పాక్ బార్డర్ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రమిది. ఇటీవలే చాణక్య అనే టైటిల్ ని కూడా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్ టైనర్ మూవీగా చెబుతున్నారు. అయితే ఇటీవల గోపిచంద్ కి ఆన్ లొకేషన్ పెద్ద ప్రమాదం వలన అతడు తీవ్రంగా గాయపడడంతో ఏకంగా నెలరోజులు పైగానే విశ్రాంతి తీసుకోవాలన్నారు. అయితే గోపిచంద్ కోలుకుని సెట్స్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. కాగా నేచురల్ స్టార్ నానీకి గ్యాంగ్ లీడర్ (వర్కింగ్ టైటిల్) సెట్స్ లో గాయమైందని వార్తలొచ్చాయి. చిన్న పాటి గాయమే అయినా వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. 

ఇక గతంలోకి ఒకసారి వెళ్తే, `శివమ్` సెట్స్ లో రామ్ కి గాయమైంది. అతడు కోలుకున్న తర్వాతనే షెడ్యూల్ రీలాంచ్ అయ్యింది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఓ సినిమా సెట్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కి గాయమైంది. అలాగే `మిస్టర్` సెట్స్ లో వరుణ్ తేజ్ కి గాయమైందని ప్రచారమైంది. అలాగే ఇటీవల `కల్కి` సెట్స్ లో యాంగ్రీ హీరో రాజశేఖర్ గాయపడడం,అది చిన్నపాటి గాయమేనని రాజశేఖర్ కోలుకున్నారని దానిపై కల్కి టీమ్ వివరణ ఇవ్వడం జరిగాయి. దీన్ని బట్టి స్టార్లు రిస్క్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం కష్టమే. చిన్నపాటి గాయమైతే ఓకే కానీ పెద్ద గాయం అయితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోక తప్పదు.

error: Content is protected !!