మీ మొబైల్ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేయలేదా..? బాధపడకండి.
మీ మొబైల్ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేయలేదా..? టెలికం కంపెనీల ఔట్లెట్లకు వెళ్లడానికి సమయం కుదరడం లేదా..? బాధపడకండి.. జనవరి 1 నుంచి మీకా శ్రమ తప్పనుంది. హాయిగా ఇంటి నుంచే మొబైల్ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకునే అవకాశం కలగనుంది. వాయిస్ గైడెడ్ సిస్టం ద్వారా టెలికం సంస్థ ఇచ్చే సూచనలు పాటించడంతో పాటు మీ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ)తో అనుసంధాన ప్రక్రియ ముగుస్తుంది.
భద్రతా కారణాల రీత్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ నంబరుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6ను గడువుగా విధించింది. అనుసంధాన ప్రక్రియ ప్రారంభమై రోజులు గడుస్తున్నా అతికొద్ది మందే ఆధార్‌ను లింక్ చేసుకోగలిగారు. ఇప్పటికీ 50 కోట్ల మందికి పైగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది.
వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని టెలికం కంపెనీలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీపీ ఆధారిత అనుసంధాన ప్రక్రియను అందుబాటులోకి తేనున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియను ఇప్పటికే అందుబాటులోకి తేవాల్సి ఉన్నా.. యూఐడీఏఐ, టెలికం కంపెనీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆలస్యమైంది.