టాలీవుడ్ లో మరో సంచలనం… బయోపిక్ గా ఉదయ్ కిరణ్ జీవితం!

తొలి సినిమా ఎలాంటి హీరోకైనా టెన్షన్ పుట్టిస్తుంది. ఆ సినిమా ఆడితే సరి లేకపోతే ప్యాకప్ చెప్పాల్సిందే. ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చే యువహీరోలకు ఇది వర్తిస్తుంది. అలాంటి ఓ హీరో సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా ఏకంగా వరుసగా మూడు భారీ హిట్లు కొడితే అతడ్ని ఏమనాలి! ఉదయ్ కిరణ్ అనాలేమో! ఎందుకంటే చాక్లెట్ బాయ్ గా ఇండస్ట్రీ తలుపు తట్టిన ఈ యువ కథానాయకుడి కెరీర్ లో తొలి మూడు చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయ్యాయి.చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే చిత్రాలతో టాలీవుడ్ ను ఊపేశాడు ఉదయ్ కిరణ్. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఉదయ్ పేరు మారుమోగిపోయింది.

నిర్మాతలు కూడా అతడి డేట్స్ కోసం క్యూలు కట్టారంటే అతిశయోక్తికాదు. యువతలో ఉదయ్ కిరణ్ ఓ ఐకాన్ అనేంతగా ఎదిగిపోయాడు. కానీ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కెరీర్ నే కాదు.. ఏకంగా అతడ్నే బలిదీసుకున్నాయి. విషాదకరపరిస్థితుల్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడడం అందరికీ తెలిసిందే.

అయితే,టాలీవుడ్ లో కొత్తగా వినిపిస్తున్న బజ్ ఏంటంటే… త్వరలో ఉదయ్ కిరణ్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రానుందట. ఉదయ్ కిరణ్ ను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరక్టర్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం.

అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్ర పోషించే నటుడు ఎవరన్నది సస్పెన్స్ గా ఉంది. అంతేకాదు, మరెవరైనా నిర్మాతలుగా వ్యవహరిస్తారా లేక తేజ స్వయంగా నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన యువకుడు చిన్న వయసులోనే సినిమా హీరోగా ఎలా ఎదిగాడు… యూత్ లో అతనంటే ఎందుకు అంత క్రేజ్ వచ్చింది… అతని జీవితంలో డిప్రెషన్ కు కారణమైన అంశాలు ఏమిటి.. అనే టాపిక్స్ ఈ సినిమాలో హైలైట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఉదయ్ కిరణ్ చివరిరోజులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలు ఈ బయోపిక్ లో చూపిస్తారట. అందుకోసం ఉదయ్ కిరణ్ భార్య సహకారం కూడా తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిగురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది.