థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టే పర్యంకాసనం
సంస్కృతంలో పర్యంకం అంటే పరుపు. పరుపుపైన పడుకున్నట్లుగా ఈ ఆసన భంగిమ ఉంటుంది గనుక దీనికా పేరు వచ్చింది. దీన్నే శుప్త వజ్రాసనం అనీ అంటారు.
ఆసనం వేసే విధానం
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి.
తర్వాత శ్వాస తీసుకొని మోచేతులు నేలకు ఆనించి నెమ్మదిగా వెనక్కి వాలాలి.
వెన్నుపూస నేలకు అనకుండా శరరీర బరువును తల మీద మోపాలి. ఈ దశలో శరీరాన్ని ఎంత పైకి లేపగలిగితే అంత లేపాలి.
ఇప్పుడు రెండు చేతులను తొడల మీద పెట్టాలి.
సుమారు 2 నిమిషాల పాటు ఇదే భంగిమలో ఉండి మెల్లగా శ్వాసించాలి.
తర్వాత మెల్లగా శ్వాస వదులుతూ వీపు నేలకు ఆనించి మోచేతుల సాయంతో తిరిగి వజ్రాసనంలోకి రావాలి.
ఇలా 4 సార్లు సాధన చేయాలి.
ప్రయోజనాలు
కాలి కండరాలను బలోపేతం చేస్తుంది.
క్రమం తప్పకుండా ఈ ఆసనం సాధన చేస్తే పొత్తి కడుపు కింది భాగానికి రక్తప్రసరణ పెరిగి అక్కడి నాడులు ఉత్తేజితమవుతాయి.
శ్వాస కోశం విస్తరించి దాని పనితీరు పెరుగుతుంది. అస్తమా, బ్రాంకైటీస్ ముప్పు తగ్గుతుంది.
పలురకాల జీర్ణకోశ సమస్యలు నివారించబడతాయి.
థైరాయిడ్ బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది.
గమనిక: తీవ్రమైన మోకాలి నొప్పులు, సయాటికా ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.