ఆదివారం ఈ పనులు చేస్తే ఇక అంతే సంగతులు…ఆ పనులు ఏమిటో తెలుసా?

సండే అనగానే చాలామందికి హ్యాపీ. కారణం సెలవు రోజు కదా. అందుకే చాలామంది కొంచెం ఆలస్యంగా లేచి తీరిగ్గా తయారవుతారు. అయితే ఆదివారం నాడు కొన్ని పనులు చేస్తే మంచిదని, కొన్నింటి జోలికి వెళ్లకపోతే ఇంకా మంచిదని అంటుంటారు. ఏరోజు పని ఆరోజే చేయాలనీ కూడా వింటుంటాం. అయితే ఆదివారం ఏ పనులు చేయొచ్చో, ఏవి చేయకూడదో జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఓసారి తెలుసుకుందాం.

వారం మొదలయ్యేది ఆదివారం తోనే. దీనికి అధిపతి సూర్యుడు. రాజరికపు పనులు, ముఖ్యంగా పదవులు చేపట్టాలన్నా ఆదివారం చేస్తే మంచిదట. ఏదైనా మీటింగ్ కి వెళ్లాలన్నా, పదిమందినీ కలవాలన్నా, ఏదైనా చర్చించాలన్నా , అధికారులను కల్సి మన పని గురించి చెప్పుకోవాలన్నా ఆదివారం చాలా మంచిందని అంటున్నారు నిపుణులు. ఇక ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులున్నా,ఉద్యోగం మారాలని అనుకున్నా ఆదివారం నిర్ణయం తీసుకంటే మంచిందంటున్నారు.

ఇక తండ్రి తరపు బంధువులతో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే ఆదివారం వెళ్లి అడిగితే తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుంది. బంగారం,ఇత్తడి ,రాగి వంటి లోహాలు కొనడానికి ఆదివారం చాలా మంచిది. గృహాల్లో ఉడ్ వర్క్ చేయించుకోవాలంటే ఆదివారం మొదలు పెడితే కూడా చాలా మంచిది. ఆదివారం సూర్యోదయానికి ముందే లేచి, వాకింగ్ వంటి ప్రక్రియల ద్వారా ప్రకృతిలో గడిపితే చాలా మంచి ఫలితం ఉంటుంది. సాహసోపేతంగా తీసుకోవాల్సిన దూకుడు నిర్ణయాలు ఆదివారం తీసుకుంటే చాలా మంచిది.

ఇక సాఫ్ట్ ఇంజనీర్లు తమకు అప్పగించిన ప్రాజెక్ట్ పనికి సంబంధించి తుది మెరుగులు దిద్దుకోడానికి,పై అధికారులకు సమర్పించడానికి కూడా ఆదివారం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్య ప్రదాత సూర్యుడు కనుక, ఆదివారం పూజలు, అభిషేకాలు,హోమాలు వంటివి చేయించుకోవడం చాలా మంచిదని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే మెడిసిన్స్ వంటివి వాడడం కూడా వీలైన పక్షంలో ఆదివారం నుంచి మొదలుపెడితే సత్ఫాలితాలు వస్తాయి.

అయితే నూతన వ్యాపార ప్రారంభం ఆదివారం చేయడం మాత్రం శ్రేయస్కరం కాదు. అలాగే ఆదివారం పడమర దిక్కు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. ఇక ఎవరికైనా వీడ్కోలు సభలు, ఫేర్ వెల్ పార్టీలు వంటివి ఆదివారం చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇక కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా విపరీతమైన సమస్యలుంటే ఆదివారం కనీసం కొంచెం సేపు రామాయణం చదివితే చాలామంచిది. ఇక ఎంత బలంగా ఉన్నాసరే, నీరసం నిస్సత్తువ ఆవహించి ఉండేవారు ఆదివారం సూర్య భగవానుని పూజించడం ద్వారా శారీరక రుగ్మతల నుంచి బయట పడవచ్చు.