హరి కృష్ణ కుటుంబానికి శాపంగా మారిన నల్గొండ జిల్లా…కారణం ఏమిటో చూడండి

తెలుగుదేశం నాయకుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం యావత్ తెలుగు ప్రజానీకాన్ని కుదిపేసింది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ యాక్సిడెంట్ కు గురయ్యారు. నెల్లూరులోని ఓ పెళ్లికి అటెండ్ అయ్యేందుకు వెళుతున్న హరికృష్ణ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొడుతూ మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ వయసు 61 సంవత్సరాలు. సెప్టెంబరు 2న ఆయన జన్మదినం జరుపుకోవాల్సి ఉంది. అంతలోనే విషాదకరరీతిలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదానికి గురిచేస్తోంది. మరింత బాధాకరమైన విషయం ఏంటంటే… హరికృష్ణ పెద్దకుమారుడు జానకీరామ్ కూడా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు.

2014లో నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో జానకిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో రావడంతో జానకిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనంలేకపోయింది. అంతకుముందు 2009లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే జిల్లాలో ప్రమాదానికి గురయ్యాడు. ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఫ్రెండ్స్ తో కలిసి కారులో వస్తున్న ఎన్టీఆర్ కు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది.

ఆ ప్రమాదంలో తీవ్రగాయాలైనా అదృష్టం బాగుండడంతో ఎన్టీఆర్ ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు నందమూరి హరికృష్ణ కూడా ఇదే నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కాకతాళీయమే అయినా కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. మరికొందరు మాత్రం నల్గొండ జిల్లా హరికృష్ణ కుటుంబానికి శాపంలా మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.