హరికృష్ణకు ఆ రెండు అంటే ప్రాణం…అవే చివరి వరకు తోడు… ఏమిటో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నందమూరి హరికృష్ణ మృతి గురించే చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా హరికృష్ణ విషయమే మాట్లాడుకుంటున్నారు. దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో వెంటాడడంతో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఫ్రెండ్ కుమారుడి పెళ్లి కోసం వస్తూ ఆయన మృత్యువాత పడ్డారు. బుధవారం ఉదయం నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన స్వయంగా నడుపుతున్న కారు ఓవర్ స్పీడ్ కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టింది.

డివైడర్ ను ఢీకొన్న కారు దాదాపు ఆరు అడుగుల ఎత్తున గాల్లోకి లేచి ఎగిరిపడింది. ఈ ఊపుకు డ్రైవింగ్ సీట్లో ఉన్న నందమూరి హరికృష్ణ రోడ్డుపై పడిపోయాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం హైదరాబాద్ తరలించారు. ఆయన పార్థివదేహానికి గురువారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హరికృష్ణ మరణంతో ముఖ్యంగా టీడీపీలో ఆయనతో సాన్నిహిత్యం ఉన్న నాయకులు విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా హరికృష్ణ గురించి తమకు తెలిసిన విషయాలు పంచుకున్నారు.

హరికృష్ణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయనకు అత్యంత ఇష్టమైనవి రెండే విషయాలని తెలుస్తోంది. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది డ్రైవింగ్. తన తండ్రి ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం అంటే ఆయన తల్లితో సమానంగా భావిస్తారు. అందుకే పార్టీ కార్యక్రమం అంటే చాలు కచ్చితంగా పసుపు చొక్కా ధరించి వస్తారు. చివరికి ఆ అలవాటు ఎలా మారిపోయిందంటే ఆయన తన బంధుమిత్రుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా పసుపు చొక్కాలే ధరించి వెళ్లడం మొదలుపెట్టారు.

ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పసుపు రంగులో ఉండే టీషర్టులకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక డ్రైవింగ్ విషయానికొస్తే… ఆయనకు కారు, బస్సు… ఇలా ఏదైనా నడపడం అంటే మహా సరదా. కొన్ని వందల కిలోమీటర్లు అలుపు సొలుపూ లేకుండా డ్రైవ్ చేయడం నందమూరి హరికృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో ఫాస్ట్ గా డ్రైవ్ చేసినా స్టీరింగ్ పై పూర్తి కంట్రోల్ ఉంటుందని చెబుతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వేగంగా నడపడం, స్పీడ్ గా డ్రైవ్ చేసినా కాన్సన్ ట్రేషన్ తప్పకపోవడం హరికృష్ణ ప్రత్యేకత అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Actor Nandamuri Harikrishna
ఎక్కడికి వెళ్లినా ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళతారు. ఇప్పుడు జీవితం చివరిక్షణాల్లో కూడా ఆయన తనకు ఇష్టమైన రెండింటిని విడిచిపెట్టకపోవడం గుర్తించిన బంధుమిత్రులు కన్నీళ్లాపులేకపోయారు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆయనే స్వయంగా కారు నడుపుతుండగా, ఒంటిపై పసుపు చొక్కానే ధరించి ఉన్నారు.