హరికృష్ణ చివరి కోరిక తీర్చలేనందుకు కన్నీరు మున్నీరు అవుతున్న NTR

నందమూరి కుటుంబంలో ఎంతో సహృదయుడిగా పేరుగాంచిన నందమూరి హరికృష్ణ మరణం నుంచి తెలుగు ప్రజలు ఇంకా తేరుకోలేదు. బుధవారం ఉదయం జరిగిన ఘోరప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అభిమానులు తమ ప్రియతమ నేత మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరైనా జీవితంలో ఓ దశకు చేరుకున్నాక సొంత కుటుంబంపై దృష్టిపెడతారు. కానీ నందమూరి హరికృష్ణ ఏకంగా 35 సంవత్సరాలపాటు కెరీర్ ను, కుటుంబాన్ని పక్కనబెట్టి తన తండ్రి ఎన్టీఆర్ కోసం అహర్నిశలు శ్రమించారు.

ఎన్టీఆర్ చైతన్యరథం డ్రైవర్ గానే కాదు అనేక విధాలుగా ఆయన తన తండ్రికి చేదోడువాదోడుగా నిలిచారు. ఆయన వ్యక్తిత్వం గురించి ఇంతకంటే గొప్పగా ఏం చెప్పగలమని కొడుకు కల్యాణ్ రామ్ అన్నాడంటే హరికృష్ణ నందమూరి కుటుంబంపై వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుంది. నందమూరి హరికృష్ణ రాజకీయనాయకుడుగానే కాదు సినీ రంగంలోనూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించేటప్పుడు హరికృష్ణ కూడా బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించారు. మళ్లీ 90వ దశకం చివర్లో హీరోగా వచ్చిన ఆయన మరపురాని చిత్రాలు చేశారు.

కథానాయకుడిగా నటించింది కొన్ని సినిమాలే అయినా ఆల్ టైమ్ హిట్స్ అనడంలో అతిశయోక్తిలేదు. సీతారామరాజు, సీతయ్య, లాహిరిలాహిరి లాహరిలో. వంటి చిత్రాలు ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలుగా నిలిచిపోతాయి. అయితే నందమూరి హరికృష్ణకు చిరకాలంగా ఓ బలమైన కోరిక ఉంది. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్టార్ హీరోలన్న సంగతి తెలిసిందే. స్వయానా హరికృష్ణ కూడా నటుడే. దాంతో కొడుకులిద్దరితో కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించాలని ఎప్పట్నించో అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని తన కుమారులిద్దరినీ కలిసినప్పుడు ప్రస్తావించగా వాళ్లు సంతోషంగా అంగీకరించారట. కానీ కథ విషయంలోనే అడుగు ముందుకు పడలేదు.
Actor Nandamuri Harikrishna
తనకు హిట్ సినిమాలు ఇచ్చిన వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో అయితే బాగుంటుందని నందమూరి హరికృష్ణ భావించేవాడట. కానీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తమ తమ ప్రాజక్టుల్లో బిజీగా ఉండడంతో హరికృష్ణ కోరిక ఇప్పటివరకు తీరలేదు. కానీ ఇప్పుడాయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కన్నీరుమున్నీరవుతున్నారు. కనీసం తండ్రి చివరి కోరిక కూడా తీర్చలేకపోయామంటూ భోరున విలపిస్తున్నారట.

ఈ నేపథ్యంలో తమ తండ్రి చివరి కోరిక కోసమైనా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి నటిస్తే ఆయనకు సరైన నివాళి అర్పించినట్టవుతుందని నందమూరి కుటుంబీకులు భావిస్తున్నారు. ఇటీవల కూడా ఓ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కథ కోసం చూస్తున్నామని, అన్నీ కుదిరితే సినిమా స్టార్ట్ చేస్తామని చెప్పారట. కొడుకులిద్దరితో కలిసి నటించాలన్నది నా చిరకాల కోరిక అని, కొడుకులు ప్రయోజకులవడం ఏ తండ్రికైనా గర్వమేనని, వాళ్లతో కలిసి నటించడం ద్వారా తన కోరిక తీర్చుకుంటానని సన్నిహితులతో చెప్పాడట. కానీ తన కోరిక తీరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు పయనమవ్వడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.