వినాయక చవితి రోజు పూజ చేసే 21 పత్రాల పేర్లు…వాటి వల్ల ఏ వ్యాధులు నయం అవుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో శుద్ధ చవితి రోజున వస్తుంది. ఈ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్ 13 న వచ్చింది. ఈ పండుగ వర్షాకాలానికి, చలికాలానికి వారధిగా వస్తుంది. ఈ సమయంలో పగటి సమయం తక్కువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉండుట వలన రకరకాల సూక్ష్మజీవులు స్వైరవిహారం చేసి మనిషి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల ఈ పండుగ పేరుతొ రకరకాల చెట్ల ఆకులను దేవుడికి సమర్పిస్తే, ఆ ఆకుల స్పర్శతో, వాటి వాసనతో ఆ అనారోగ్యాల నుండి బయట పడవచ్చు. వినాయక చవితి రోజు మనం 21 పత్రాలతో పూజ చేస్తాం. ఆ పత్రాల పేర్లు, వాటి కారణంగా ఏ అనారోగ్య సమస్యలు తగ్గుతాయో వివరంగా తెలుసుకుందాం.

1. మాచీ పత్రం (దవనం ఆకు) : ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నిదానిస్తాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది.మనోవైకల్యం, అలసట తగ్గుతాయి.

2. బృహతీ పత్రం (నేల మునగ ఆకు) : దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది.

3.బిల్వ పత్రం (మారేడు ఆకు) : ఈ పత్రం తిదళంతో త్రిగుణాకారంలో ఉంటాయి. బిల్వ పత్రాలంటే శివునికి కూడా ప్రీతికరమే. మధుమేహ రోగులకు,విరేచనాలను తగ్గించటం,అతిసారం వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. కంటి సంబంధ వ్యాధులను అరికడుతుంది. ఈ చెట్టు శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల జన్మించిందని పురాణాల్లో చెప్పబడింది. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది.

4.దూర్వాయుగ్మం (గరిక) : ఈ ఆకు మానసిక రుగ్మతలను,చర్మ రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటువ్యాధులు నివారిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణిగా పనిచేసి తొందరగా తగ్గేలా చేస్తుంది. వాంతులు, విరోచనాలను అరికట్టడంలో గరిక చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గజ్జి వంటి చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది.

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు): నల్ల ఉమ్మెత్త చాలా మంచిది. ఉబ్బసం,కోరింత దగ్గు,చర్మ రోగాలు,ఉదార కోశ వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాక కీళ్ళనొప్పులకు కూడా ఈ ఉమ్మెత ఆకు బాగా పనిచేస్తుంది.

6. బదరీ పత్రం (రేగు ఆకు) : జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. రక్తంలో ఉన్న దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలను తగ్గిస్తుంది.

7. అపామార్గ పత్రం (ఉత్తరేణి) : ఈ ఉత్తరేణి ఆకును పాపసంహారిణి, రాక్షస సంహారిణి అని కూడా పిలుస్తారు.
ఉత్తరేణి ఆకును మంచి ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. వేడి చేసి వేసే సెగ గడ్డలకు మంచి మందు. దీనితో పళ్ళను తోముకుంటే దంత సమస్యలు తొలగిపోవటమే కాకుండా దంతాలు బలంగా ఉంటాయి.

8. కశ్యపాయ పత్రం (తులసి ఆకు) : తులసి ఆకులలో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకం తులసిని అయినా పూజలో వాడవచ్చు. తులసి ఆకు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. విషాన్ని హరించే లక్షణాలు కూడా తులసిలో ఉన్నాయి. జలుబు,దగ్గు,వాంతులు వంటి వాటిని అదుపు చేస్తుంది. అజీర్ణ వ్యాధులను కూడా తగ్గిస్తుంది.

9. చూత పత్రం (మామిడి ఆకు) : ఈ ఆకును మనం పర్వదినాల్లోనూ,శుభకార్యాల్లోనూ గుమ్మాలకు తోరణంగా కడతాం. మామిడి ఆకులతో ఇంటికి తోరణం కడితే ఇంటికి కొత్త శోభ కలుగుతుంది. మామిడి ఆకుతో విస్తరి కుట్టుకొని దానిలో భోజనం చేస్తే ఆకలి పెరుగుతుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. శరీరంలో మంట, చిగుళ్ల బాధలు,పాదాల పగుళ్లు వంటి వాటిని నివారించుకోవచ్చు.

10. కరవీర పత్రం ( గన్నేరు ఆకు) : తలలో ఉండే పేలను నివారించి జుట్టుకు రక్షణను కలిగిస్తుంది. మూత్ర వ్యాధులు,గుండె జబ్బులను తగ్గిస్తుంది. అంతేకాక దురదల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి) : జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపు వంటి వాటికీ ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, సాధారణమైన దగ్గులను కూడా తగ్గించగలదు.

12. దాడిరి పత్రం (దానిమ్మ ఆకు) : రక్తవృద్ధి కలుగజేస్తుంది. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా మంచిది. అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది. పిల్లల కడుపులో నులిపురుగులు లేకుండా చేస్తుంది.

13. దేవదారు పత్రం (దేవదారు ఆకు) : జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెంచటానికి చాలా దోహదం చేస్తుంది. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దేవదారు ఆకు తైలం కళ్లకు చలువనిస్తుంది.

14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. మరువం నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

15. సిందూర పత్రం (వావిలాకు) : జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, తలనొప్పి,పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది.

16. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజి ఆకు అంటే సన్నజాజి ఆకు కాదు. జాజికాయ, జాపత్రికి చెందిన ఆకు.

17. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఈ ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

18. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి సమస్యలను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది

19. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసారం వంటి వాటిని నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది.జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది

20. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) :దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తారు. శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తుంది. వాత పిత్త కఫాలకు మంచిది. పితృకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్‌ను అరికడుతుంది.

21 అర్క పత్రం (జిల్లేడు ఆకు) : ఈ ఆకు సూర్యునికి చాలా ప్రీతికరమైనది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది.