బిగ్ బాస్ పై కౌశల్ ఆర్మీ ఫైర్.. ఎందుకో తెలుసా ?

ఇప్పటికే బిగ్ బాస్ షోని శాసిస్తున్న కౌశల్ ఆర్మీ ఇటీవల యాంకర్ నాని తీరుపై సీరియస్ అవ్వడం,దానిపై ఎవరి పట్లా పక్షపాతం తనకు లేదని నాని ట్వీట్ చేయడం తెల్సిందే. నిజానికి బిగ్ బాస్ షో కి ఇంతటి పాపులారిటీ రావడానికి ఓ విధంగా కౌశల్ కారణం. అతనికి ఉన్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ షోకి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అయితే తాజాగా మరో అంశం మీద కౌశల్ ఆర్మీ స్పందిస్తూ బిగ్ బాస్ పై ఫైర్ అయింది. బిగ్ బాస్ షో 100 రోజులకు చేరుకుంటున్న తరుణంలో హౌస్ మెంబర్స్ కి సర్ఫరైజ్ ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను బిగ్ బాస్. ఇంటిలోకి ప్రవేశ పెట్టడంతో అందరిలో భావోద్వేగాలు చెలరేగాయి. హౌస్ అంతా ఎమోషన్ తో నిండిపోయింది.

ఇక హౌస్ లో ఎప్పుడూ గంభీరంగా కనిపించే కౌశల్ తన భార్య పిల్లలను చూడగానే ఏడుపు ఆపుకోలేక, పిల్లలను ఎత్తుకుని వాళ్ళను మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యాడు. అయితే బయట విషయాలు కౌశల్ కి అంతగా తెలియక పోవడంతో కౌశల్ ఆర్మీ గురించి నీలిమ వివరిస్తూ నిన్ను ఆరాధించే అభిమానులకోసం గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని, వారికోసం సీజన్ టైటిల్ గెలవాలని సూచిస్తూ ఎమోషనల్ అయింది.

ఇప్పటికే జనం దృష్టిలో టైటిల్ గెలిచేశావని, జనం అభిమానాన్ని గెలుచుకోవడం ద్వారా మీ తల్లి కోరిక నెరవేరిందని నీలిమ వివరించింది. దీంతో కౌశల్ ఆనంద భాష్పాలు రాలుస్తూ, ఏమిచ్చి ఈ అభిమానుల ఋణం తీర్చుకోగలనని భార్య నీలిమను పట్టుకుని ఎమోషన్ కి గురయ్యాడు. అయితే ఇలా అభిమానుల కోసం ఎమోషన్ అయిన వీడియో బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్ లో వెయ్యకపోవడంపై కౌశల్ ఆర్మీ సీరియస్ అయింది. కౌశల్ పట్ల వివక్షత తగదని, ఏది ఏమైనా కౌశల్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఖాయమని కౌశల్ ఆర్మీ కుండబద్దలు కొట్టింది.