టాలీవుడ్ విలన్ హఠాన్మరణం… షాక్ లో చిరంజీవి, బాలకృష్ణ..

తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్ లో సీనియర్ విలన్ గా ప్రసిద్ధి చెందిన కెప్టెన్ రాజు హఠాన్మరణం చెందారు. కెప్టెన్ రాజు స్వస్థలం కొచ్చి. సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు వచ్చింది. కొచ్చిలోని పలారివాట్టంలో ఉన్న తన నివాసంలోనే హార్ట్ అటాక్ కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కెప్టెన్ రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవిరాజ్ ఉన్నారు.
vilan capain raju
కొన్నినెలలుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. కొన్ని నెలల క్రితం కొడుకు పెళ్లి పనుల కోసం అమెరికా వెళుతుండగా విమానంలోనే గుండెపోటుకు గురయ్యారు కెప్టెన్ రాజు. దాంతో ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆ విమానాన్ని అప్పటికప్పుడు మస్కట్ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. కొన్నాళ్లపాటు మస్కట్ లోనే చికిత్స పొందిన కెప్టెన్ రాజును ఇటీవలే కొచ్చి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నారు.

కానీ మరోసారి గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. కెప్టెన్ రాజు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1981లో విడుదలైన రక్తం అనే చిత్రంతో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం రౌడీ అల్లుడు చిత్రంతో ఆయనకు బాగా పేరొచ్చింది. అంతకుముందు బలిదానం, శత్రువు చిత్రాల్లోనూ విలన్ గా చేసి మెప్పించారు. ఆ తర్వాత కొండపల్లి రాజా, జైలర్ గారి అబ్బాయి, గాండీవం, మొండిమొగుడు పెంకిపెళ్లాం, మాతో పెట్టుకోకు వంటి చిత్రాల్లో నటించారు.

తెలుగు, తమిళంలోనే కాదు సొంత భాష మలయాళంలోనూ అనేక చిత్రాల్లో చేసి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన మొదట్లో మిలిటరీలో పనిచేశారు. కెప్టెన్ గా అనేక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. దాంతో అందరూ ఆయనను కెప్టెన్ రాజు అని పిలిచేవారు. సినిమా రంగంలో కూడా అదే పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడాయన మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో విషాదకర వాతావరణం నెలకొంది.