కేరళ కోసం భర్త రాజీవ్ ని ఒప్పించి సంచలన నిర్ణయం తీసుకున్న యాంకర్ సుమ

తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని యాంకర్ గా కొనసాగుతున్న సుమ తెలుగమ్మాయి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. మలయాళీ అయినా తెలుగు గడ్డపై పెరగడంతో ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు బాగా వంటబట్టిచ్చుకుంది. ప్రత్యేకించి ఆమె చెప్పేవరకు ఎవరికీ తెలియదు సుమ కేరళ అమ్మాయని. అంతలా తెలుగువాళ్లతో కలిసిపోయింది. చివరికి తెలుగువాడైన రాజీవ్ కనకాలనే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలైపోయింది.

ఎంతైనా పుట్టింటిపై మమకారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇప్పుడు సుమ కూడా తన సొంత రాష్ట్రం కేరళ వరదల కారణంగా దెబ్బతినడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. వందలమంది చనిపోవడం, లక్షలమంది ఇళ్లు కూడా లేక నిరాశ్రయులు కావడం సుమను కలచివేసింది. ఇప్పటికే తనవంతు విరాళం ప్రకటించి ఉడుతాభక్తిగా సాయం చేసింది. కానీ ఆమెకు ఇది చాలదనిపించింది. వెంటనే తన భర్త రాజీవ్ కనకాలతో చర్చించి కేరళ బయల్దేరింది.

భర్తతో సహా అనేక ప్రాంతాల్లో పర్యటించిన సుమకు కేరళలో ఎంతటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో తెలిసింది. ముఖ్యంగా అలెప్పీ జిల్లాలో కున్నుమ్ము అనే ప్రాంతంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అందులో కనీసం ఒక్క బిల్డింగ్ కూడా పనికిరాకుండాపోయాయి. అంతకుముందే శిథిలావస్థకు చేరుకున్న ఆ ఆసుపత్రి వరదకారణంగా మరింత దెబ్బతిన్నది. దాంతో ఆ ఆసుపత్రిని తాము నిర్మిస్తామంటూ సుమ సంచలన నిర్ణయం తీసుకుంది.

భార్య ఆలోచనకు రాజీవ్ కు మద్దతుగా నిలిచాడు. దాంతో మరింత ఉత్సాహంగా రంగంలోకి దిగన సుమ కోట్లాది రూపాయలతో ఆ ఆసుపత్రిని అత్యంత అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు పూనుకుంది. కున్నుమ్ము ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉంటారు. వారికి అందుబాటులో ఉన్నది ఇదొక్కటే ఆసుపత్రి. అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ కృష్ణతేజతో కూడా మాట్లాడి ఆయన ద్వారా కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్ తోనూ చర్చించారు.

అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ కృష్ణతేజ తెలుగువాడు కావడంతో రాజీవ్ కనకాల, సుమ దంపతులకు అన్నివిధాలా సాయపడేందుకు ముందుకు వచ్చాడు. కృష్ణతేజ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతానికి చెందినవాడు. ఇక, కేరళ రాష్ట్ర మంత్రి థామస్ ను ఒప్పించడంలో ఆయన సుమ దంపతులకు ఎంతో సహకరించాడు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ కున్నుమ్ము ఆసుపత్రి నిర్మాణానికి ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఎన్ని కోట్లైనా భరిస్తామని, పేదవాళ్లకు ఆరోగ్యసౌకర్యాలు అందాలనేదే తమ తాపత్రయం అని పేర్కొంది.