8 రోజులు… 8 నిముషాలు…. 54 కోట్లు… చిరు కోసం చెర్రీ సాహసం… ఏమిటో?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150సినిమాతో 150వ సినిమా రామ్ చరణ్ నిర్మించారు. అది మెగా హిట్ కావడంతో ఇక చిరంజీవి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా 151వ సినిమాగా సైరా చిత్రాన్ని చిరంజీవితో కొణిదెల బ్యానర్ పైనే రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం బడ్జెట్ కి ఏమాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది.

భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సైరా తో మెగాస్టార్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో గానీ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. బడ్జెట్ ముఖ్యం కాదు, ఏ రేంజ్ లో చేశామా అన్నది ముఖ్యమని ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పిన చెర్రీ ఇప్పుడు అందుకు అనుగుణంగా ఖర్చుకి వెనుదీయకుండా ఓ సాహసం చేసాడట.

ప్రస్తుతం జార్జియాలో సైరా మూవీ యుద్ధ సన్నివేశాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ నుంచి 150మంది యుద్ధ సన్నివేశాలకోసమే జార్జియా తరలివెళ్లారు. అక్కడ మరో 600మందిని షూటింగ్ కోసం ఏర్పాటుచేసుకున్నారు. సినిమాలో ఈ యుద్ధ సన్నివేశాల నిడివి కేవలం 8నిముషాలు ఉంటుందట. అయితే ఇక్కడ ఖర్చుకి వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మక యుద్ధ సన్నివేశాలకు దాదాపు 54కోట్లు వెచ్చిస్తున్నారట.