‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్…తండ్రిని తలచుకొని కన్నీరు పెట్టిన తారక్…ఓదార్చిన త్రివిక్రమ్

ఎందరో డైరెక్టర్స్ తో కల్సి పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కల్సి చేసాడు. నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేత వీర రాఘవ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ హోటల్ లో మంగళవారం సాయంత్రం అభిమానుల నడుమ నిర్వహించారు. ఈసందర్బంగా తారక్ మాట్లాడుతూ కంటతడిపెట్టారు. ఒక్కసారిగా తన తండ్రి హరికృష్ణను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి పోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేదని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది.

‘ఓ మహాను భావుని కడుపున నేను పుడితే, నా కడుపున మీరు పుట్టారు. అభిమానులు మన కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. అలాంటి అభిమానులను ఎప్పటికీ మరిచిపోరాదు’అని తనతండ్రి హరికృష్ణ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని తారక్ కన్నీళ్లు కారుస్తూ చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు కూడా మీ వెంటే మేము అంటూ ధైర్యం చెప్పారు. తండ్రి అంటే ఎలా ఉండాలో,భర్త అంటే ఎలా ఉండాలో,తాత అంటే ఎలా ఉండాలో హరికృష్ణ ఆచరించి చూపారని అలాంటి మంచి మనిషితో దేవుడికి ఏపని ఉందని తీసుకెళ్లాడో అని తారక్ ఆవేదన చెందారు.

‘త్రివిక్రమ్ తో సినిమా చేయాలని 12 ఏళ్లనాటి కల. నువ్వే నువ్వే మూవీ నుంచి ఆయనతో పరిచయం ఉంది. మా ఇద్దరి కాంబినేషన్ లో ఎందుకు మూవీ రావడం లేదని అందరూ అనుకున్నారు కూడా. అయితే ఎట్టకేలకు అరవింద సమేత మూవీ తో ఆలోటు తీరుతోంది. వాడి రోజంటూ ఉంటె ఎవడైనా గెలుస్తాడు అన్నదే ఈ మూవీ అంతరార్ధం. యుద్ధాన్ని ఆపేవాడే మొనగాడు అని ఈ చిత్రం రుజువుచేస్తుంది.

ఇక మన జీవితంలో ఎన్నో గొడవలు, వివాదాలు వచ్చి ఉండవచ్చు కానీ మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజెప్పేదే అరవింద సమేత మూవీ’అని తారక్ చెప్పుకొచ్చాడు.’నేను 28 సినిమాలు చేసినా ,ఎందులోనూ తండ్రి చితికి నిప్పు పెట్టె సీన్ చేయలేదు. కానీ ఈ మూవీలో చేశాను. మరి యాదృచ్ఛికమో ఏమో గానీ నాన్నగారిని ఆ దేవుడు తీసుకుపోయాడు’అంటూ ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ ఆత్మబంధువని,తమన్ మ్యూజిక్ ఎంతో కష్టపడి చేసాడని,జగపతి యాక్షన్ ఈ చిత్రానికి ఎసెట్ అని , నిర్మాత రాధాకృష్ణ అభిరుచుకి అనుగుణంగా చిత్రం వచ్చిందని ఇలా అందరి గురించి చెబుతూ తారక్ తన ప్రసంగం సాగించాడు.