నాని, కౌశల్ పై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు…. వీరి ప్రవర్తన విరక్తి కలిగించిందట

బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షో ముగిసి వారం కావస్తున్నా ఇంకా ఈ షాపై వివాదాలు కొనసాగుతున్నాయి. విన్నర్ గా నిలిచిన కౌశల్ కి దాదాపు 39కోట్ల ఓట్లు వచ్చాయట. అయితే కౌశల్ ని విన్నర్ గా ప్రకటించడం,గతంలో ఎన్నడూ లేనట్లు వార్ వన్ సైడ్ గా ఉండడంతో కొందరు సందేహాలు,అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మొదటినుంచి షో మొత్తం కౌశల్ ఆర్మీ చేతుల్లోకి పోయిందని,వాళ్లకు ఇష్టం లేని వాళ్ళను ఎలిమినేట్ చేసారని విమర్శలు చుట్టుముడుతున్నాయి. అసలు బిగ్ బాస్ చేతిలో ఉండాల్సిన షో ఇలా ఎందుకు అయిపోయిందని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇలా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదమవుతున్నాయి.

ముఖ్యంగా సెకండ్ సీజన్ లో పాల్గొన్న ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని ఈ షో తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయన రాసిన ఆర్టికల్ లో సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. కొంతమంది కంటెస్టెంట్స్ ముందుగానే సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటుచేసుకుని, తద్వారా తమకు ఇష్టంలేని వాళ్ళను తొక్కేశారని ఆయన ఆరోపించారు.

మహిళా కంటెస్టెంట్స్ అని కూడా చూడకుండా తేజస్వి,భానుశ్రీ వంటివాళ్లను ట్రోల్ చేసారని ఆయన మండిపడ్డారు. నిజానికి రూల్స్ కి అనుగుణంగా ఆడిన వాళ్ళే విజేతలని, ఇతర మార్గాల్లో గెలిచినవాళ్లు విజేతలు ఎలా అవుతారని బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదని, ఈ సైబర్ వార్ తట్టుకోలేక ఓ ప్రొఫెషనల్ సంస్థ పోలీసులకు కూడా పిర్యాదు చేసిందని బాబు అన్నారు.

హోస్ట్ నానిపై వత్తిడి ఉండకపోతే ఇంకా బాగా పనిచేసేవారని,అయితే కొన్ని విషయాల్లో నాని ప్రవర్తన చూసాక, బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చామా అని , తనకు విరక్తి కల్గిందని షాకింగ్ కామెంట్స్ చేసారు. కౌశల్ ని చివాట్లు పెట్టికూడా మళ్ళీ సమర్ధిస్తూ మాట్లాడ్డం నచ్చలేదని,ఇక ఎలిమినేట్ అయిన శ్యామల, నూతన్ నాయుడులు మళ్ళీ హౌస్ లోకి రావడం అసలు బాగోలేదని ఆయన వ్యాఖ్యానించారు. వీళ్ళు బయటకు వెళ్లి రావడంతో బయట విషయాలను చెవిలో కొందరికి చేరవేశారని,దీంతో దీప్తి,గీతా మాధురి ల గేమ్ లో కూడా మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.