బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక వీరి పరిస్థితి ఏమిటి…. బిగ్ బాస్ ప్లస్ అయిందా…? ఒక విశ్లేషణ

బుల్లితెరపై హీరో నాని హోస్ట్ గా మొదలై,18మంది కంటెస్టెంట్స్ తో , 110 రోజులకు పైనే నడిచిన బిగ్ బాస్ టు రియాల్టీ షో లో చివరిలో కౌశల్,తనీష్, గీతా మాధురి,దీప్తి నల్లమోతు ,సామ్రాట్ గ్రాండ్ ఫినాలేలో మిగలడం, ఇక ఎండింగ్ కి చేరేసరికి కౌశల్ , గీతా మాధురి మధ్య సాగిన హోరాహోరీగా పోరు పోరులో కౌశల్ విజేతగా టైటిల్ గెలవడం, గీతా రన్నరప్ అవ్వడం తెల్సిందే. అయితే ఈ షోలో పాల్గొన్న వారికి తాము కోరుకున్న గుర్తింపు వచ్చిందా లేదా అనేది వారికే తెలియాలి.

ఇందులో దీప్తి నల్లమోతు ఓటివిలో న్యూస్ ప్రెజెంటర్ గా పనిచేస్తూ జీవితంలో ఏదైనా సాధించాలన్న ఉద్దేశ్యంతో కష్టపడి గేమ్ ఆడుతూ ప్రతి టాస్క్ లో తానేమిటో నిరూపించుకుంది. తెలుగు వాళ్లందరికీ పరిచయం అయింది. అయితే గ్రాండ్ ఫినాలేలో అందరికన్నా ముందే ఎలిమినేట్ అయిన ఈమె 15 రోజుల రెస్ట్ తర్వాత ఉద్యోగంలో చేరతానని చెప్పింది.

మోడల్ గా,టివి సీరియల్ నటుడిగా రాణించిన కౌశల్ బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయం అయ్యాడు. ఇక విజేతగా కూడా నిలవడంతో ఎక్కడ చూసినా కౌశల్ కౌశల్ అనే నామస్మరణ అవుతోంది. హౌస్ లో ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా తన లక్ష్యం మరిచిపోకుండా గేమ్ ఆడుతూ విజేత అయిన కౌశల్ నిజానికి మహేష్ బాబు నటించిన రాజకుమారుడు మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా సక్సెస్ అందుకున్నప్పటికీ హీరోగా రాంచలేకపోయానన్న ఆవేదన ఉండిపోయింది.

అయితే బిగ్ బాస్ ద్వారా పదింతల క్రేజ్ వచ్చేసింది. కౌశల్ ఆర్మీ పేరిట లక్షలాది అభిమానులు ఏర్పడ్డారు. కౌశల్ ని హీరోగా చూడాలని అభిమానులు కోరుకోవడం, కౌశల్ కి కూడా ఆ కోరిక బలంగా ఉండడంతో ఈ షో పూర్తయిన వెంటనే రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ వచ్చేసింది. ఇక పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో కౌశల్ హీరోగా మూవీకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట.

కాగా తెలుగులో మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి అందం,హావభావాలు ఆడియన్స్ కి ఈ షో తెలియజేసింది. అమాయకత్వం,లాజికల్ ఆలోచన ఆమెను ప్రేక్షకుల దరిచేర్చాయి. నిజానికి పాటల పరంగా ఈ మధ్య ఛాన్స్ లు తగ్గడంతో నటనా రంగంలో కాలుపెట్టాలని చూస్తున్న ఈమెకు బిగ్ బాస్ షో బానే దోహదం చేసిందని అంటున్నారు. భర్త నందుకు తెలుసున్న వాళ్ళు గీతను హీరోయిన్ గా పెట్టి మూవీ తీయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి హీరోగా నందు ఉంటాడో,ఎవరైనా ఉంటారో చూడాలి.

బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి,యువ హీరోగా సినిమాల్లో నటించిన తనీష్ కొన్ని హిట్స్ అందుకున్నాడు. కానీ సినిమాల్లో వెనుబడిన తనీష్ తన క్రేజ్ ని మరింత పెంచుకోడానికి బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. నచ్చావులే మూవీ ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో ఈ షోలో ఎంటర్ అయ్యాక అదే రేంజ్ లో క్లిక్ అయ్యాడు. దీంతో మళ్ళీ సినిమాల్లో హీరోగా ఛాన్స్ లు వస్తున్నాయట.

ఇక సినిమా రంగం నుంచి వచ్చిన మరో సెలబ్రిటీ సామ్రాట్ కి సినిమాల్లో మంచి బ్రేక్ రాలేదు. సుమంత్ నటించిన యువకుడు మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన సామ్రాట్, పంచాక్షరీ,అహ నా పెళ్ళంట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాలలో నటించాడు. అయినా సరైన గుర్తింపు రాకపోవడం,పర్సనల్ గా కొన్ని వివాదాలు చుట్టముట్టడం నేపథ్యంలో తానేమిటో నిరూపించుకోడానికి ఈ రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. హౌస్ లో అతడు ప్రదర్శించిన నేర్పు,నవ్వు తెప్పించేలా చేసిన చేష్టలు చూసిన కొందరు సినీ ప్రముఖులు ఇప్పుడు సామ్రాట్ ని కమెడియన్ గా చూపిస్తూ సినిమాలకు ప్లాన్ చేస్తున్నారట.