‘నోటా’ సినిమా నెగిటివ్ టాక్ రావటానికి కారణాలు ఇవేనా?

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి మూవీతో ఒకేసారి టాప్ రేంజ్ కి చేరిన విజయ్ దేవరకొండ కు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఇటీవల గీతగోవిందం కూడా బానే హిట్ అయింది. దీంతో మార్కెట్ లో ఇతడి రేంజ్ మరింత పెరిగింది. ఇక తాజాగా నోటా మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీకి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. రివ్యూస్ కూడా అలానే ఉన్నాయి. అయితే మొదటిరోజే విషయాన్నీ చెప్పేయలేమని గతంలో ఎన్నో మూవీస్ నిరూపించాయి. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడానికి కొన్ని కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ గత చిత్రాలకు అనుగుణంగా ఈ మూవీ లేదని, తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమా తీయలేదని అంటున్నారు. కథే నిజమైన హీరో అనే లాజిక్ ఇక్కడ మిస్సయ్యారని అంటున్నారు.

ముఖ్యంగా గీత గోవిందం తర్వాత భారీ అంచనాతో రిలీజవ్వడం ఓ విధంగా కొంచెం ఇబ్బంది కల్గించిందని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కు ఆడియన్స్ లో ఓ ప్రత్యేక శైలి వుంది. ఆడియన్స్ ఇతడి యాక్టింగ్ నాడి పట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ స్పెషల్ ఎప్పీయరెన్స్ అనేది మిస్సయింది. అలాగే విజయ్ ఎక్కువ సేపు సినిమాలో కనిపించకపోవడం,ఒక వేళ కనిపించినా అతని స్టైల్ ఇందులో ఆడియన్స్ కి నచ్చలేదు. ఇక సినిమా కథలో చాలా మైనస్ లున్నాయని అంటున్నారు.

ఒక్కొక్క రాజకీయ నాయకుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఒచోటకు చేర్చి అల్లిన చందంగా ఈ సినిమా వుంది. స్టోరీలో భాగంగా సంఘటనలు ఉంటె రక్తి కడ్తుంది. కానీ ఆయా సంఘటనల కోసం స్టోరీ అల్లారు. అందుకే రుచించడం లేదు. ముఖ్యమంత్రి చనిపోతే అతడి భార్యను సీఎం చేయడం,దొంగస్వాముల పెత్తనం, అమ్మాయిలతో కల్సి ఉన్న వీడియోలు బయటకు వస్తే,అవి షాట్ ఫిలిం కోసమని కవర్ చేయడం, సీఎం వస్తుంటే వంగివంగి దండం పెట్టడం, పక్కవాడే సీఎం ని వెన్నుపోటు పొడవడం ఇలా కొన్ని ఘటనలను ఏర్చికూర్చి అల్లిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

తమిళ తీరు తెన్నులు ఎక్కువగా ఇందులో కనిపించడం పెద్ద మైనస్ పాయింట్ అంటున్నారు. హీరో తప్ప మిగిలిన రోల్స్ లో అందరూ తమిళియన్స్ కనిపిస్తారు. తెలుగు, తమిళ నటుల కాంబినేషన్ లో తీయడం ద్వారా రెండుచోట్లా మార్కెట్ కొట్టేయాలని నిర్మాతలు అనుకుని ఉంటారు. కానీ స్టోరీ అడ్డం తిరిగింది.