టాలీవుడ్ లో తీరని మరో విషాదం… షాక్ లో సినీ పరిశ్రమ

‘స్ఫూర్తి’ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు, రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు డాక్టర్‌ చుండి మధుసూదన్‌(48) ఇకలేరు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని తన సోదరి నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో పుట్టిపెరిగిన మధుసూదన్‌.. నాటక రంగంపై మక్కువతో 18వ ఏటనే హైదరాబాద్‌ వచ్చారు. ప్రముఖ నటుడు, నట శిక్షకుడు డీఎస్‌ దీక్షితులు వద్ద శిష్యుడిగా చేరి… తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల, జానపద కళలపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సినారె ఆశీస్సులతో ‘స్ఫూర్తి’ సాంస్కృతిక సేవా సంస్థను మధు స్థాపించారు.

నాటక రంగమే జీవితంగా బ్రహ్మచారిగా గడిపిన మధును అందరూ ‘మెగా’ మధు అని పిలిచేవారు. మెగాస్టార్‌పై అభిమానంతో హైదరాబాద్‌ బాట పట్టిన ఆయన ఎందరో యువ నటులకు, దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ లో ఉన్న కొందరు యువ సినీ హీరోలకు డీఎస్‌ దీక్షితులు సారథ్యంలో ఆయన శిక్షణ కూడా ఇచ్చారు.పలు సినిమాల్లోను నటుడిగాను ఆయన కనిపించారు. ఓ సినిమాకు దర్శకత్వం వహించే పనిలో ఉండగా.. హఠాన్మరణం చెందారు. మధు మరణం నాటకరంగానికి తీరని లోటని నట శిక్షకుడు డీఎస్‌ దీక్షితులు అన్నారు.