ఎగిరే పావురమా సినిమాలో నటించిన లైలా గుర్తుందా…. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

24 అక్టోబర్ 1980లో గోవాలో జన్మించిన లైలా తెలుగులో ఎగిరే పావురమా సినిమాతో పరిచయమైంది. అందులో ఆమె చిలిపి అల్లరితో కూడిన నటన ప్రేక్షకులకు భలే నచ్చేసింది. సినిమా ఘన విజయంలో ఆమె పాత్ర కూడా ఉంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్న లైలా తెలుగులో వరసగా అవకాశాలు పట్టేసింది.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎగిరే పావురమా సినిమాలో నటించిన లైలా, తర్వాత ఆయనే హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఉగాది సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఉగాది మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్, సౌందర్య హీరో, హీరోయిన్లుగా వచ్చిన పెళ్ళి చేసుకుందాం సినిమాలో కథను కీలక మలుపు తిప్పే లైలా పాత్రలో వెంకటేష్‌కు మరదలుగా నటించింది. ఆమె చలాకీ నటన, లైలా ఓ లైలా పాటలో ఆమె గ్లామర్ విందు తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గరచేశాయి.

అయితే ఆమె ఆ తర్వాత చేసిన ఖైదీ గారు, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, లవ్ స్టోరీ 1999 సినిమాలు ఆమెకు అంత పేరు తీసుకురాలేదు. అయితే తమిళ ఇండస్ట్రీ ఆమెకు ఘనస్వాగతం పలికింది. అక్కడ ఆమె దీన, దిల్, నంద, పీతామగన్ (తెలుగులో శివపుత్రుడు) సినిమాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. పీతామగన్ సినిమాలో నటనకు గాను ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, తమిళనాడు స్టేట్ అవార్డు వరించాయి. తెలుగులో ఆమె నటించిన ఆఖరి సినిమా Mr. & Mrs. శైలజా కృష్ణమూర్తి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

2006లో ఇరాన్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహమాడిన లైలా, క్రమంగా సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆమె సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతోంది.