Politics

జగన్ పై దాడి తో పెరిగిన పొలిటికల్ హీట్….ఎవరికీ లాభం ఎవరికీ నష్టం

ఏదైనా ఓ ఘటన జరిగితే దానికి రాజకీయ రంగు అద్దడం చూస్తున్నాం. ఇక రాజకీయ నేతపై దాడి జరిగితే అది రాజకీయ రంగు పులుపుకోకుండా ఉంటుందా ?ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో వైస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ దుండగుడు దాడి చేసాడు. కోడిపందాల్లో కట్టే కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఇక ఈ ఘటన జరిగాక వెంటనే రకరకాల చర్చలు, ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఎవరి కోణంలో వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. దీంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. జగన్ కి జనంలో వస్తున్న ఫాలోయింగ్ ని చూసి చంద్రబాబు ప్రభుత్వం ఓ పధకం ప్రకారం,దాడిచేయించిందని, తృటిలో ప్రమాదం తప్పిందని ఓ వర్గం ఆరోపిస్తుంటే, ఈ దాడి కావాలనే జగన్ చేయించుకున్నాడని, తద్వారా సానుభూతి పొందాలని చూసున్నాడని,దాడి చేసిన వ్యక్తి శ్రీనివాస్ పక్కాగా జగన్ అభిమాని మరో వర్గం తిప్పికొడుతోంది.

టిడిపి, వైసీపీల మధ్య ఆరోపణలు యుద్ధం జోరుగా నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా ఇందులో లాగి, దీనివెనుక పవన్ పన్నాగం ఉందని ఓ వర్గం ఆరోపణ చేస్తోంది. కాదు కాదు ఇదంతా రాష్త్ర ప్రభుత్వాన్ని ఏదోవిధంగా పడగొట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఓ వర్గం అంటోంది. ఇక ఈ ఘటన వలన ఏ పార్టీకి మైలేజ్ వస్తుందని కూడా జోరుగానే చర్చ నడుస్తోంది.

ఈ ఘటన వలన ఎవరికి లాభం,ఎవరికి నష్టం అంటూ బేరీజు వేస్తున్నారు. ఇక జగన్ ని రన్ వె మీద లోకల్ పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి అడ్డుకున్నారని,ఇప్పుడు కత్తితో దాడి వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని వైసిపి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ దాడిని చిన్న విషయంగా తీసేస్తారా అని ఆమె మండిపడ్డారు. మరోపక్క విజయ సాయిరెడ్డి కూడా ప్రభుత్వ తీరుని ఎండగట్టారు.

ఇక బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు, తెలంగాణా సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్, ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,ఇలా వరుసగా అందరూ జగన్ పై దాడి ఘటనపై స్పందించగా,డిజిపిని గవర్నర్ నరసింహన్ వివరణ కూడా కోరారు. ఇక ఆపరేషన్ గరుడ లో భాగంగానే ఈ ఘటన జరిగిందని, ఏపీలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టిడిపి ఆరోపిస్తూ, ఇటీవల ఆపరేషన్ గరుడ గురించి హీరో శివాజీ వివరించినట్టే ఈ దాడి ఉందని టిడిపి వాళ్ళు గుర్తుచేసున్నారు.

అలాగే దాడి జరిగాక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరకుండా జగన్ నవ్వుకుంటూ విమానం ఎక్కేసి హైదరాబాద్ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరడాన్ని టిడిపి మంత్రులు ఆరోపించారు. అసలు ఈ ఆరోపణలు, ప్రతి విమర్శలు ఇలా సాగుతుంటే,తమ కుటుంబానికి జగన్ అంటే అభిమానమని,అసలు శ్రీనివాస్ ఎందుకలా చేసాడో అర్ధం కావడం లేదని దుండగుని తల్లి , ఇతర కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మొత్తానికి ఈ ఘటనలో వాస్తవాలు తేలకముందే టిడిపి , వైసిపి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.