‘విచిత్ర సోదరులు’ సినిమాలో కమల్ మరుగుజ్జు పాత్ర వెనుక రహస్యం తెలుసా?

విభిన్న పాత్రలు వేయాలని చాలా కొద్దిమంది నటులు అనుకుంటారు. అందులో అగ్రగణ్యుడు కమల్ హాసన్. విచిత్ర సోదరులు సినిమా చూస్తే అందులో మరుగుజ్జు పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. ఇంతకీ కమల్ పాత్ర కోసం చిత్ర బృందం ఎంతో శ్రమపడిందంట. ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా గురించి తరచూ అందుకే ప్రస్తావిస్తారు. తాజాగా మరోసారి ప్రస్తావించారు. అదేమిటో విందాం.

కమల్ ను అలా చూపించడానికి 18 అంగుళాల పొడవైన ఓ షూ ప్రత్యేకంగా తయారు చేయించాం. జపాన్ అనే సెట్ బోయ్ ఆ షూను తయారు చేశాడు. కాళ్లను వెనక్కి మడిచి కట్టి, మోకాళ్లను ఆ షూలో దూర్చి బెల్ట్ సాయంతో వెనక్కి కట్టేశాం. షూ కలర్ లోనే కమల్ తొడిగే ప్యాంట్, నడిచే ఫ్లోర్ ఉండేలా చూసుకున్నాం.

వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే తాను కష్టపడి నాలుగడుగులు వేస్తే, వైర్ వర్క్, కెమెరా వర్క్ ఎడిటింగ్ సహాయంతో 40 అడుగులు వేసినట్లు చూపించొచ్చు అని సింగీతం చెప్పుకొచ్చారు. అలాగే ‘బబ్బాబ్బా.. బబ్బారీ’ పాటలో కమల్ ఓ గోడపై సాటి మరుగుజ్జులతో కూర్చొని వాళ్లతో పాటు కాళ్లూపుతాడు. దానికి మేం చేసిన వర్క్ కూడా మామూలుగా చేయలేదు.

కమల్ ఆ గోడపై వజ్రాసనంలో కూర్చుంటే తన మోకాళ్లకు ఆర్టిఫిషియల్ కాళ్లను అమర్చాం. వాటిని కూడా జపానే తయారు చేశాడు. ఆ కాళ్లకు వెనుకనుంచి వైర్లను కట్టి పాట తాళాన్ని బట్టి రైల్వే సిగ్నల్స్ మాదిరి కదిలించాం. ఈ విషయంలో సెట్ బోయ్ జపాన్ చేసిన కృషిని నిజంగా అభినందించాల్సిందే అంటూ అప్పుడు పడిన కష్టాన్ని సింగీతం ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే వుంటారు.