పొట్టి శ్రీరాములు గారి విద్యాబ్యాసం ఎలా జరిగిందో?
మద్రాసు (ప్రస్తుత చెన్నై)లోని జార్జిటౌన్, అన్నాపిళ్లై వీధిలోని 163వ నెంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన పుట్టారు. తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లి.. నెల్లూరు జిల్లాలో ఉండేవి.శ్రీరాములు ఫిఫ్త్ ఫార్మ్ వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్‌లో డిప్లమో చేశారు.
గ్రేట్ ఇండియన్ పెనిన్స్యులర్ రైల్వే (ప్రస్తుత సెంట్రల్ రైల్వే)లో అసిస్టెంట్ ప్లంబర్‌గా ఉద్యోగం పొందారు.శ్రీరాములు తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయింది. ఆ తర్వాత భార్య సీతమ్మ ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ, ఆ పిల్లాడు ఐదు రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయ రోగంతో సీతమ్మ మరణించింది.అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. గాంధీ అనుమతితో 1930 ఏప్రిల్‌లో సబర్మతి ఆశ్రయంలో చేరారు.