హీరోయిన్ అవుదామని వచ్చి గయ్యాళి అత్తగా స్థిరపడిన సూర్యకాంతం గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు

గడసరి అత్త పాత్రకి తగిన న్యాయం చేయగలిగే నటి అంటే సూర్యకాంతం గారే. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగు సినీ చరిత్రలో గయ్యాలి అత్త అనగానే గుర్తొచ్చేది సూర్యకాంతం గారే. ఆమె నటన జనాల్ని ఎంతలా భయపెట్టిందంటే ఆ పేరు పెట్టుకోవడానికి ఇప్పటికీ జనాలు భయపడేంత. ఒక సావిత్రి,ఒక జమున,ఒక అంజలీదేవి ఇలా ఎంతో మంది కథానాయకలు చిత్రపరిశ్రమలోకి వచ్చారు వెళ్లారు.సూరమ్మత్త మాత్రం ఒక్కరే…ఆమె తర్వాత ఎంతో మంది అత్త పాత్రల్లో నటించార. కానీ ఆమె మెప్పించినంతగా మెప్పించలేకపోయారు. అత్తపాత్రలు వేసేవారికి ఇప్పటీకి సూర్యకాంతంగారే స్పూర్తి..అంతలా ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయన సూర్యకాంతం గారి జన్మదినం సంధర్బంగా ఆవిడ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం.

1. సూర్యాకాంతం తూర్పుగోదావరి జిల్లా వెంకట కృష్ణరాయపురంలో తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానం..ఆరేళ్లకే పాడడం,నాట్యమాడడం నేర్చుకున్న సూర్యకాంతం గారికి హింది సినిమా పోస్టర్లను చూసి సినిమాలవైపు ఆకర్శితురాలయ్యారు.అలా చెన్నై రైలెక్కి సినిమా అవకాశాల కోసం వచ్చేసారు.

2. సినిమా హీరొయిన్ అవుదామని వచ్చిన సూర్యకాంతంగారికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది..కానీ ఆ సినిమా షూటింగ్ లో కారు యాక్సిడెంట్ అయి ముఖానికి గాయం కావడంతో తప్పుకోవాల్సొచ్చింది.

3. తర్వాత చిన్న చిన్న వేషాలు వేస్తున్న టైంలో ముంబై వెళ్లి బాలివుడ్లో నటించాలనే కోరికుండేది సూర్యకాంతం గారికి,అత్త పాత్ర చేసిన తర్వాత బాలివుడ్లో ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ వదిలేసుకుంది సూర్యకాంతం.అంతకుముందు ఆ పాత్రకోసం వేరొకర్ని తీసుకుని ,తీసేయడంతో ఒకరిని బాదపెట్టి తీసుకున్న క్యారెక్టర్ తనకొద్దని వదిలేసింది..ఆ తర్వాత అత్తపాత్రలకే పరిమితం అయిపోయారు సూర్యకాంతం .

4. మొదటి సారి గయ్యాలి అత్తపాత్ర వేసిన సినిమా పేరు సంసారం.. ఆ రోజుల్లోనే రిలీజవబోయే సినిమాలో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు,డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి గా ఎదురు చూసేవాళ్లంటే ,ఆవిడకున్న క్రేజ్ అర్దం చేసుకోవచ్చు.

5. అయితే సినిమాల్లో గయ్యాలిగా నటించినప్పటికీ సూర్యకాంతం గారి మనసు వెన్న. అలా అనడానికి బోలెడు ఉదాహరణలున్నాయి.అవసరం అని వచ్చినవారికి కాదనేవారు కాదు. అచ్చం మన మహానటి లాగే.

6. నాగయ్యగారు ఎంత పెద్ద నటుడో మనకు తెలుసు.ఒక సినిమాలో అతన్ని తిట్టే సన్నివేశం షాట్ అవ్వగానే అతని కాళ్లపై పడి క్షమాపన కోరిన మర్యాదతత్వం ఆమెది..నువ్వెందుకమ్మా బాదపడడం,నీ పాత్ర తిట్టింది నువ్వు కాదు కదా అని నాగయ్య గారు అంటే కన్నీరు పెట్టుకున్నారట.

7. ఆమె పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ముద్రవేసిందంటే ..ఏదన్నా ఫంక్షన్స్ కి ఆమె అటెండ్ అయితే కనీసం ఆటోగ్రాఫ్ కోసం ఆమె దగ్గరకు వెళ్లాలన్నా భయపడేవారట. సీరియస్ గా కనపడే సూర్యకాంతం గారిలో బోలెడు కామెడీ సెన్స్ ఉండేదట.షూటింగ్ స్పాట్ లో జోక్స్ చెప్పి అందరిని నవ్వించేవారట.

8. షూటింగ్ కి వచ్చేప్పుడు ఇంటి నుండి తినుబండారాలు తేవడం ,షూటింగ్ దగ్గర అందరికి పెట్టడం మాత్రమే కాదు.ఇంటికొచ్చినవారిని భోజనం పెట్టకుండా పంపేవారు కాదట.

9. “నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. ‘సూర్యకాంతం’ అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు..అని గుమ్మడిగారు స్వయంగా ఆవిడతో అంటే నవ్వి ఊరుకుందట…

10. సూర్యకాంతం గారి భర్త పేరు పెద్దిబొట్ల చలపతిరావు గారూ..హైకోర్టు జడ్జీగా పనిచేసారు ఆయన.