Politics

బాలల దినోత్సవంను నెహ్రు గారి పుట్టినరోజున ఎందుకు జరుపుకుంటారు?

భారతదేశాన్ని దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే… నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు.

కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు.

ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.