Politics

సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం చేయనున్నారా? దీనిలో నిజం ఎంతో చూడండి

రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని అంటారు కదా. ఎందుకంటే, బద్ధ శత్రువు కాంగ్రెస్ తో టిడిపి జతకట్టడం లాంటి ఘటనలు ఇందుకు ప్రబల నిదర్శనం. వైసిపిలో ఉన్న ఎమ్మెల్యే టిడిపి ప్రచారం చేస్తారట. ఈమేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఇదేలాగో చూద్దాం. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలకు కాలుదువ్విన అధికార టిఆర్ ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నం చేస్తుంటే, టిఆర్ ఎస్ ను నిలువరించాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే టిడిపి,టిజెఎస్, సిపిఐ పార్టీలు మహాకూటమిగా జట్టుకట్టాయి. సీట్ల పంపకాల్లో భాగంగా 14సీట్లు టీడీపీ కి వచ్చాయి.

టిడిపి కి కేటాయించిన సీట్లలో బలమైన అభ్యర్థులను రంగంలో దించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కూకట్ పల్లి సీటు నుంచి స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలోకి తెచ్చారు. కాంగ్రెస్ మద్దతు,సెటిలర్స్ ఎక్కువగా ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సీటుని ఎలాగైనా గెలవాలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నీ ఆలోచించి, సుహాసినికి టికెట్ ఇచ్చారు. అయితే ఈమె తరపున వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రచారం చేస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మొదటి నుంచి హరికృష్ణ కుటుంబంతో నానికి అనుబంధం ఉంది. హరికృష్ణ అంటే ఎంతో అభిమానం, ప్రేమ ఉన్నాయి. అదేవిధంగా హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో మంచి దోస్తీ ఉంది. అందుకే ఇతనికి టీడీపీ టికెట్ గుడివాడ నుంచి ఇచ్చారని అంటారు. అయితే ఆతరువాత పరిణామాల్లో వైసిపిలో చేరిన నాని,ఆపార్టీ తరపున కూడా విజయం సాధించారు.

ఇప్పుడు హరికృష్ణ కూతురు బరిలో ఉన్నందున ప్రచారం చేయాలని భావించి,వైసిపి అధినేత జగన్ అనుమతి కోరాడట. అయితే ఇతడి ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు అంగీకరిస్తాయా అంటే నో అన్నమాట వినిపిస్తోంది. ఆంధ్రాలో టిడిపి,వైసిపి మధ్య పోటీ ఉన్నందున కూకట్ పల్లి లో ప్రచారం చేస్తే వేరే సంకేతాలు వెళ్తాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చూద్దాం ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందొ.