తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ ఎవరికీ సపోర్ట్ గా ఉందో తెలుసా?
ముందస్తుగా వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఓ పక్క అధికార టిఆర్ ఎస్,మరోపక్క ,కాంగ్రెస్ సారధ్యంలో టిడిపి,సిపిఐ,టీజె ఎస్,ఇంకోపక్క బిజెపి,మజ్లీస్ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచి ప్రచార జోరు సాగిస్తున్నారు. ఇక ఎన్నికలన్నాక సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా రంగంలో ఉంటారు కదా. అదేవిధంగా తమకు ఇష్టమైన పార్టీ తరపున ప్రచారంలో కూడా పాలుపంచుకోవడం రివాజు. ఇక సినీ పరిశ్రమ ఎవరివైపు మొగ్గుతోందో ఓసారి పరిశీలిస్తే, అక్కినేని కుటుంబం టి ఆర్ ఎస్ నేతలతో సంబంధాలు కలిగి ఉంది.
టిఆర్ ఎస్ మంత్రి కేటీఆర్ తో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. ఎక్కడ ఏదైనా కార్యక్రమం జరిగినా కేటీఆర్ అడిగిందే తడవుగా నాగార్జున అందులో పాల్గొనడం చేస్తుంటారు. ఇక నాగార్జున కోడలు,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అయితే తెలంగాణా చేనేత వస్త్ర రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. దీంతో అక్కడ చేనేత అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మొత్తం మీద చూస్తే, టి ఆర్ ఎస్ తో బిజినెస్ పరంగా కూడా అక్కినేని ఫామిలీ క్లోజ్ గానే ఉంది. అందుకే టి ఆర్ ఎస్ గెలవాలని అక్కినేని ఫామిలీ కోరుకుంటూ ప్రత్యక్షంగానో,పరోక్షంగానో తమ మద్దతు తెలుపుతోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే కేసీఆర్ గురించి, ఆయన ప్రభుత్వం గురించి సభాముఖంగా మాట్లాడుతూ,దేశంలోనే నెంబర్ వన్ సీఎం గా కేసీఆర్ ఉన్నారని,తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఎంతో సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఇక నా రూటే వేరు అని చెప్పే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా కేసీఆర్ పాలన భేష్ అని మెచ్చుకోవడమే కాక,కేసీఆర్ ని సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని సంచలన ప్రకటన చేసారు.
కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఎవరూ ఎక్కడ చేయడం లేదని మోహన్ బాబు కుటుంబం చెబుతూ పరోక్షంగా టి ఆర్ ఎస్ కి మద్దతు తెల్పింది. ఇక ఇప్పుడూ కూడా రాజకీయాలపై ముందుగా స్పందించే పోసాని కృష్ణమురళి కూడా తన ఓటు కేసీఆర్ కేనని కుండబద్దలు కొట్టారు. ఇలా అక్కినేని కుటుంబం,మెగా ఫామిలీ,మోహన్ బాబు ఫ్యామిలీ,ఇంకా పలువురు సెలబ్రిటీలు కూడా టి ఆర్ ఎస్ వైపే ఉన్నారు. మరి టాలివుడ్ పెద్దలు కోరుకున్నట్లు కేసీఆర్ మళ్ళీ వస్తారా,లేక ప్రజల ఆలోచన వేరేగా ఉందా అనేది ఎన్నికల తర్వాతే తేలాల్సి ఉంది.