Movies

తెలంగాణాలో రియల్ హీరోలు మరోసారి తెలుగువాళ్ళ గొప్పతనాన్ని చూపించారు

తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 119నియోజక వర్గాల్లో డిసెంబర్ 7శుక్రవారం పోలింగ్ జరగ్గా, ఇక ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. అధికార టి ఆర్ ఎస్, కాంగ్రెస్ – టిడిపి – టీజె ఎస్ – సిపిఐ లతో కూడిన ప్రజా కూటమి,బిజెపి,ఎం ఐ ఎం పార్టీలతో పాటు పెద్దఎత్తున స్వతంత్రులు రంగంలో ఉన్నారు. అన్ని నియోజక వర్గాల్లో కల్సి 1821మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో గెలుపు ఓటములపై ఎవరి అంచనాలు వారికున్నాయి. 32వేల185పోలింగ్ కేంద్రాల్లో ఉదయం గంటలనుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరిగింది.

ఇక ఈ ఎన్నికల్లో సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కుని కుటుంబాలతో సహా వచ్చి వినియోగించుకున్నారు. టాలీవుడ్ లో ఎక్కువమంది ఓట్లు జూబ్లీహిల్స్ పరిధిలో ఉండగా,మరికొందరి ఓట్లు హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. దర్శకులు,నటీ నటులు,కేరక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలామంది కోస్తా రాయలసీమ ప్రాంతాలకు చెందినవారే కావడం,వారి ఓట్లు ఏపీలో కాకుండా తెలంగాణలోనే ఉండడం విశేషం.

అందరం తెలుగు వాళ్లమేనన్న భావనతో తెలంగాణా గడ్డపై అభిమానం పెంచుకుని ప్రాంతీయ బేధాలు లేవని చాటిచెప్పారు. ఎపి ప్రజలకు,తెలంగాణ ప్రజలకు ఓ విధంగా టాలీవుడ్ హీరోలు,టెక్నీషియన్స్ వారధిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణా ప్రజలతో కలసిపోయి,అక్కడి సంస్కృతిని జీర్ణించుకున్నారు. టాలీవుడ్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు, ప్రాంతీయ బేధాలు లేకుండా ఎపి,తెలంగాణ ప్రజలు చూస్తుంటారు.

రాజకీయంగా తెలుగువాళ్లు వాళ్ళు విడిపోయారు తప్ప,మానసికంగా కాదని టాలీవుడ్ వాళ్ళు చాటుతున్నారన్న మాట బలంగానే వినిపిస్తోంది. అందుకే రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు అయినా సరే,ఎక్కడా ఫలానా రాష్ట్రం అని చెప్పకుండా తాము తెలుగు వాళ్లమని చెబుతూ వస్తున్నారు. తెలంగాణా గడ్డపై ఉన్నామని ఘనంగా చెప్పుకుంటారు.

మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులు, ఎస్ ఎస్ రాజమౌళి,అక్కినేని నాగార్జున,జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, మహేష్ బాబు,శ్రీకాంత్,పోసాని కృష్ణ మురళి, పరుచూరి గోపాలకృష్ణ,వరుణ్ తేజ్,అల్లు అర్జున్, రామ్,రానా తదితరులు ఓట్లు వినియోగించుకుని తెలుగు సినీ పరిశ్రమ స్టామినా చాటారు.