Politics

బాబు వర్సెస్ కెసిఆర్ అన్నట్లు గా తెలంగాణా ఎన్నికలు… ఎవరు గెలుస్తారో?

ఎన్నికలంటేనే అదో రసవత్తర పోరు. అన్నదమ్ములు,బావా బావమరుదులు,అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ నడుస్తుంది. ఇక తెలంగాణా లో అయితే డిసెంబర్ 7న పోలింగ్ ముగియడంతో ఇక లెక్కింపు మీదే ప్రధానంగా దృష్టి పడింది. ఇక తెలంగాణ ఎన్నికలు ఇద్దరు చంద్రుల మధ్య పోటీగా సాగిందని చెప్పాలి. తెలంగాణా చంద్రుడు కె సి ఆర్,ఎపి చంద్రుడు చంద్రబాబు ల మధ్య ఎత్తుగడలు వ్యూహ ప్రతివ్యూహాలు నడిచాయి. ఎవరు గెలుస్తారు,ఎవరు ఓడిపోతారు, పూర్తి మెజార్టీ వస్తుందా, హంగ్ వస్తుందా ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరోపక్క బెట్టింగ్ ల జోరు అందుకుంది.

ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమై,ప్రభుత్వాన్ని రద్దు చేయాంతో ఆరునెలల ముందే తెలంగాణా ఎన్నికలు అచ్చి పడ్డాయి. ప్రధానంగా పోటీ టి ఆర్ ఎస్, ప్రజా కూటమి నడుమ హోరా హోరీ పోటీ నెలకొందని అంటున్నారు. కాంగ్రెస్,టిడిపి,సిపిఐ,టీజె ఎస్ లు ప్రజా కూటమిగా అవతరించాయి. ఇక బిజెపి,మజ్లీస్ విడివిడిగా పోటీ పడ్డాయి.

తెలంగాణాలో చంద్రబాబు చొరవ చూపకపోతే ప్రజాకూటమి అనేది ఉండేది కాదని, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి వనరులు వచ్చేవి కాదని అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ కూడా అద్భుత వ్యూహ కర్త. చంద్రబాబుని ఢీ కొట్టే చాతుర్యం, నేర్పు కేసీఆర్ కి ఉన్నాయి.
కేసీఆర్ ని ఓడించడానికి చంద్రబాబు పన్నిన ఎత్తుగడ ఫలించబోతోందని కొందరు విశ్లేషకుల వాదన. ఇందుకు కారణం లేకపోలేదు. 9ఏళ్లపాటు

సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నందున చంద్రబాబుకి ప్రతి విషయం బాగా తెలుసు. ఎక్కడ ఏది ఉందొ , ఎవరిని కదిపితే ఏమౌతుందో చంద్రబాబుకి తెలుసనీ అందుకే వాటన్నింటిని ప్రయోగించి,టి ఆర్ ఎస్ కి ముచ్చెమటలు పట్టించారని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే పార్టీల కన్నా కేసి ఆర్ , చంద్రబాబు నడుమే పోరు నడిచిందని చెప్పవచ్చు. ఫలితాలు వస్తే గానీ ఎవరి సత్తా ఏమిటో తెలీదు. ఇద్దరు చంద్రుల నడుమ సాగిన పోరులో ఏ చంద్రుడు గెలుస్తాడో వేచి చూడాల్సిందే.