Movies

అలనాటి నటి రాజశ్రీ గుర్తు ఉందా… ఆమె జీవితంలో జరిగిన ఎవరికి తెలియని విషాద సంఘటన

బాలనటిగా ఎంట్రీ ఇచ్చి,అందాల భామగా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రాజశ్రీ అంటే ఆరోజుల్లో ఎంతో పాపులర్. మంచి డాన్సర్ అయిన ఆమె అభినయం అమోఘం. రాకుమారిగా, గాంధర్వ కన్యగా,రాజశ్రీని చూసినవాళ్లు చూపు తిప్పుకోలేక పోయేవారట. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కల్పి దాదాపు 200సినిమాల్లో నటించింది. ఒక్కరోజు కూడా షూటింగ్ కి సెలవు పెట్టకుండా ఉన్న ఏకైక నటిగా ఆమెను చెబుతారు. ఆనాటినుంచి ఈనాటి వరకూ ఈమెను మించిన అందగత్తె అయిన డాన్సర్ ఇప్పటికీ ఫీల్డ్ కి రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పట్లో జానపద చిత్రాలు ఎక్కువగా రావడం,అందులో రాజశ్రీ కీలక పాత్రలు ,ముఖ్యంగా కాంతారావు సరసన ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో సజీవంగా ఉన్నాయి.

ఎంతగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నా సరే,ఆమె వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా వైవాహిక జీవితంలో విషాద ఘటనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1945ఆగస్టు 31న జన్మించిన రాజశ్రీ అసలు పేరు కుసుమకుమారి. తండ్రి సూర్యనారాయణరెడ్డి రైల్వే స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవారు. ఆమె తల్లి లలితాదేవి. రాజశ్రీ చిన్ననాటినుంచి డాన్స్ లో శిక్షణ పొందింది.

1956లో తమిళంలో వచ్చిన నాగదేవతి మూవీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. భక్త అంబరీష,మాంగల్యం తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించింది. 1962లో భార్య అనే మళయాళ మూవీతో హీరోయిన్ గా మెరిసింది. ఆసినిమాలో ఆమె పేరు గ్రేసీ కావడం, అది హిట్ అవ్వడంతో మళయాళ రంగంలో గ్రేసీగానే కొనసాగింది. ఇక కానిస్టేబుల్ కూతురు మూవీతో తెలుగులో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.

అగ్గి బరాటా ,చిట్టిచెల్లెలు,పిడుగు రాముడు వంటి చిత్రాలతో ఎన్టీఆర్ తో రాజశ్రీ నటించి స్టార్ హీరోయిన్ అయింది. కాంతారావు, శోభన్ బాబు వంటి వారితో నటించి టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. పక్కలో బల్లెం,బంగారు తిమ్మరాజు,ప్రతిజ్ఞా పాలన,జయసింహ,అగ్గిదొర,భూలోకం యమలోకం,మెరుపు వీరుడు, అగ్గిమీద గుగ్గిలం వంటి చిత్రాలు కాంతారావు తో చేసి హిట్ ఫెయిర్ గా నిల్చింది.

1978లో ఆనాటి సీఎం జలగం వెంగళరావు హయాంలో చీఫ్ విప్ గా పనిచేసిన తోట పాంచజన్యంని వివాహం చేసుకున్న రాజశ్రీ జీవితంతో విధి ఆడుకుంది. 1983లో పాంచజన్యం హఠాన్మరణం చెందడంతో రాజశ్రీ కుంగిపోయింది. ఆమెకు అప్పటికే నాగ శేషాద్రి అనే కొడుకు ఉన్నాడు. నాలుగేళ్ల వయసు గల కొడుకుతో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. విశాఖ వచ్చి సెటిల్ అయింది.