జగన్ తో అలీ భేటీ వెనుక చాలా కథే ఉందట! అదేమిటో తెలుసా?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శతృవులు వుండరనేది అందరూ చెప్పేదే. అందరూ చూస్తున్నదే. అంతెందుకు నిన్నటి దాకా బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన చంద్రబాబు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక, ఏనాటి నుంచో శతృవుగా ఉన్న కాంగ్రెస్ తో చేయిచేయి కలపలేదా? అసలు కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద తెలుగుదేశం పుట్టింది. కానీ పరిస్థితులు కాంగ్రెస్ దిశగా నడిపించాయి. ఇక కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ ని అధికారంలోకి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మారిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ కాంగ్రెస్ ను వీడారు. సొంతంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి,కాంగ్రెస్ ని జగన్ సవాల్ చేస్తున్నారు. ఇక జనసేన నేత పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో టిడిపి ని బలపరిచి, ఇప్పుడు కత్తులు దూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ జోరుగా ప్రజల మధ్యకు దూసుకొస్తున్నాడు. సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఇక గత ఎన్నికల్లో కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరంగా ఉండిపోయిన జగన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సాగుతూ మరికొద్ది రోజులలో ముగియబోతోంది. అది అయ్యాక బస్సు యాత్ర కూడా చేస్తాడని అంటున్నారు.
పలువురు సినీ నటులు కూడా అనూహ్యంగా జగన్ కి మద్దతు తెలుపుతూ పాదయాత్రలో కూడా పాల్గొంటున్నారు. కమెడియన్ పృద్వి,నటుడు కృష్ణుడు వంటివాళ్ళు ఢిల్లీలో వైసిపి తరపున ప్రత్యేక హోదా కోసం దీక్షలో కూడా పాల్గొన్నారు. పోసాని కృష్ణ మురళి,సినిమా సీనియర్ ఫొటోగ్రఫిస్ట్ చోటా కె నాయుడు వంటి వాళ్ళు పాదయాత్రలో పాల్గొని జగన్ తో అడుగులు వేశారు. ఇవన్నీ పక్కన పెడితే, స్టార్ కమెడియన్ అలీ తాజాగా జగన్ తో భేటీ కావడం చర్చకు దారితీసింది.
పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా మెలిగే అలీ చేరితే జనసేన లో చేరతాడే కానీ, వైసిపిలో ఎందుకు చేరతాడని సహజంగా అందరూ అనుకునేదే.ప్రస్తుతం ఏ పార్టీలో లేని అలీ ఓ పక్క సినిమాల్లో ,మరోపక్క టివి షోల్లో బిజీగా ఉంటూ పాదయాత్రలో ఉన్న జగన్ ని కలవడం వెనుక పెద్ద రహస్యమే ఉందని అంటున్నారు. ఈ మధ్య జగన్ ,పవన్ ల మధ్య విమర్శలు చోటుచేసుకున్నాయి. అవి వ్యక్తిగత స్థాయిలో ఉండడంతో అందరూ చర్చించుకున్నారు. పవన్ పెళ్లిళ్ల విషయాన్నీ జగన్ లేవనెత్తడంతో పవన్ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అప్పటివరకూ పవన్, జగన్ లు పొత్తు పెట్టుకుంటారని టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఆరోపిస్తూ వచ్చారు. అయితే పవన్,జగన్ ల మధ్య వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో అది ఉత్తిదే అని తేలిపోయింది. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుని ఓడించడానికి పవన్,జగన్ లు పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సేపు జగన్ పక్కన కూర్చుని అలీ చర్చలు జరపడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
పైగా ఎవరైనా సినీ నటులు వచ్చినపుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడే మాట్లాడేసి పంపించేసే, జగన్ తాజాగా అలీ విషయంలో ఏకాంతంగా నవ్వుతూ చాలా సేపు మాట్లాడ్డం చూస్తుంటే పవన్ తరపున అలీ రాయబారానికి వచ్చాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కదా. చూద్దాం ఈ భేటీ వెనుక ఏ మతలబు ఉందో ?