రధసప్తమి రోజు జిల్లేడు ఆకుఫై రేగి పండు పెట్టుకొని తలస్నానం ఎందుకు చేస్తారు?

ఈ సంవత్సరం రధసప్తమి ఫిబ్రవరి 12 మంగళ వారం వచ్చింది. ఆ రోజున మనం జిల్లేడు ఆకుల ఫై రేగి పండ్లు పెట్టుకొని తలస్నానం చేసి పాలు పొంగించుకొని సూర్యునికి పూజ చేసి పరమాన్నం నైవేద్యం పెట్టటం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రధసప్తమి రోజు జిల్లేడు ఆకుల ఫై రేగి పండ్లు పెట్టుకొని తలస్నానం ఎందుకు చేస్తారో వివరంగా తెలుస్కుందాం.

రధసప్తమి సూర్యున్ని ఆరాధించే పండగ. రధసప్తమి మహా శుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే స్నానం చెయ్యడం, సూర్యున్ని పూజించటం వలన పుణ్యమని, ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహరకమని చెప్పబడింది. అయితే ఈ రధసప్తమి రోజున జిల్లేడు ఆకుల ఫై రేగి పండ్లు పెట్టుకొని తలస్నానం ఎందుకు చేస్తారో, దాని విశేషం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జిల్లేడు ఆకులు సూర్యునికి ఇష్టమైన ఆకులు. వీటినే అర్కపత్రములని కూడా పిలుస్తారు. శిశిర ఋతువులో రధసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రధసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వలన వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడతాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానము చేయాలనీ మన పెద్దలు చెప్పారు.

ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మవ్యాధులు, అనారోగ్యములు రాకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్పుతున్నారు. ఇదే విషయాన్నీ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేసారు. ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణ శక్తి శిరో భాగంలోని సహాస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉతేజ పరుస్తంది. దీని వల్ల మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తీ పెరుగుతాయి.

ఇక రేగిపళ్ళ విషయానికి వస్తే వైద్య పరంగా రేగు పళ్లలో ఆయుర్వేదిక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రేగిపండును తలమీద పెట్టుకొని స్నానము చేసినప్పుడు శరీరంపై జాలువారుతూ కిందపడతాయి. దాని వల్ల శరీరంపై ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.సాక్షాత్తూ నారాయణుడు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడ‌నీ, ఆ ఫలాలని తింటూ త‌న‌ తపస్సుని కొనసాగించాడ‌ని… దేవుడికే ప్రీతిపాత్ర‌మైన ఈ పండ్లను తల మీద పెట్టుకొని తలస్నానము చేస్తే చర్మ వ్యాధులు తగ్గటమే కాకుండా సాక్షాత్తు నారాయ‌ణుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారంలోను నిగూఢమైన అర్ధం దాగి ఉందని అర్ధం అయిందిగా.