జనసేన డిజాస్టర్ దిశగా వెళుతుందా…కారణాలు ఇవే?
రాజకీయాల్లో కొత్తదనం తెస్తానని,యువతకు భవిష్యత్తు ఇస్తానని చెప్పుకొస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య జనంలో బానే దూసుకెళ్లాడు. కానీ ఇప్పుడు పెద్దగా స్పందన కానరావడం లేదని,పార్టీలోకి పేరుమోసిన వాళ్ళు ఎవరూ రావడం గానీ,కనీసం అటువైపు చూడడం గానీ చేయడం లేదని అంటున్నారు. మరో పక్క టిడిపి జనాకర్షక పథకాలతో దూసుకెళ్తోంది. ఇంకోపక్క విపక్ష వైసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ముగించి మరోయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
జనసేనలో టికెట్ల దరఖాస్తుల పర్వం కూడా జోరుగా సాగుతోంది. టిడిపి,వైసిపి కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇక ఏ క్షణంలో నైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే గెలుపు గుర్రాలకోసం అన్వేషిస్తూ జాబితా సిద్ధం చేసే పనిలో అన్ని పార్టీలు పడ్డాయి. ఇక ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి , ఈ పార్టీ నుంచి ఆపార్టీకి జంపింగ్ లు కూడా జోరందుకున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో , ఏ పార్టీ టికెట్ మీద పోటీచేస్తారో ఇంకా క్లారిటీ రావడం లేదు.
ముఖ్యంగా టిడిపి నుంచి వైసిపికి,వైసిపి నుంచి టిడిపికి ఇలా నాయకులూమారుతుంటే,అసలు ఛార్మీషా గల నేతలెవరూ జనసేన వైపు చూడడం లేదు. ప్రజారాజ్యం తో పోలిస్తే అప్పట్లో చిరంజీవిని చూసి చాలామంది కాపు సామాజిక వర్గ నేతలు ప్రజారాజ్యంలో చేరిపోయారు. మాజీ,ఎమ్మెల్యేలు ,తాజా మాజీలు కూడా ప్రజారాజ్యం గూటికి చేరి పోటీచేశారు. ఎన్టీఆర్ లెవెల్లో చిరంజీవి అధికారం లోకి వచ్చేస్తాడన్న అంచనాలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు జనసేనలో ఎందుకో అలాంటి ఊపు కనిపించడంలేదు.
రెండు మూడు నెలల నుంచి దృష్టి పెట్టినా అది నిలబడడం కష్టమనే మాట వినవస్తోంది. సుదీర్ఘ కసరత్తు ఉండాలని,పార్టీ నిర్మాణం అంటే ఆషామాషీ కాదని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంతగా స్లో గా వెళ్తున్నారు,ఎందుకు ఆకట్టుకునేలా చేయలేకపోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటివరకూ చూస్తే, కేవలం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే చేరారని, అందులో ఒకరు బిజెపి నుంచి రాగా,ఆయనకు టీడీపీలో ఛాన్స్ లేకపోవడంతోనే వచ్చారని వినిపిస్తోంది.
ఇక మరో ఎమ్మెల్యే అయితే ఎక్కడ పోటీచేసిన గెలవడం కష్టమనే మాటా వినిపిస్తోంది. నిజానికి ఆ ఎమ్మెల్యే కి వైసిపిలో ఛాన్స్ లేకపోవడంతో జనసేనవైపు దూకారని అంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలో కూడా ఎమ్మెల్యేల పేర్లు వినిపించడం లేదు. ఇక ఏ కమిటీ వేసినా సరే అందులో పాత వారి పేర్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరో 15రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్న దశలో ఒక్కసారిగా జనసేన ఊపు తగ్గిపోవడం చూస్తుంటే, అసలు ఏ దిశగా వెళ్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.