దీనస్థితిలో టాలీవుడ్ హీరోయిన్ – ఆసుపత్రి బిల్ కట్టలేక ఎదురు చూపు
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్నాళ్ళు ఆ లైఫ్ వేరు. ఖర్చులు కూడా అలానే ఉంటాయి. కొందరు జాగ్రత్త పడతారు. మరికొందరు ఉన్నదంతా పోగొట్టుకుంటారు. ఛాన్స్ లు రావు. ఎవరూ ఇవ్వరు. ఆర్ధికంగా దెబ్బతినేస్తారు. దైన్య స్థితిలో ఉంటారు. ఎవరినీ నోరు విడిచి అడగలేరు. మొహమాటం వెంటాడుతూ ఉంటుంది. ఏం చేయాలో తోచదు. సరిగ్గా ఇలాంటి దీనస్థితిలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన విజయలక్ష్మి ఉంది. హనుమాన్ జంక్షన్ మూవీలో జగపతి బాబు, అర్జున్ కి చెల్లెలుగా నటించింది. హీరో వేణుకి ఆమె హీరోయిన్ గా వేసింది. అయితే ఆమె ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఒకసారి వివరాల్లోకి వెళ్తే, విజయలక్ష్మి కన్నడంలో నాగ మండల,సూర్యవంశం వంటి మూవీస్ లో నటించింది. అయితే హనుమాన్ జంక్షన్ తర్వాత తెలుగులో ఛాన్స్ లు లేకపోవడంతో బెంగుళూరు వెళ్లి అక్కడ కన్నడ సీరియల్స్ లో బిజీ అయింది. ఈలోగా తల్లికి ఆనారోగ్యం కావడంతో తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి తల్లికి వైద్యం చేయించింది. చేతిలో పైసా కూడా లేకుండా పోయింది. పోనీలే తల్లికోసం కదా ఖర్చు పెట్టాను. మళ్ళీ సంపాదించవచ్చులే అనుకుంది. కానీ ఇంతలోనే ఆమెకు అస్వస్థత ఏర్పడి,ఆరోగ్యం క్షిణించింది.
బిపి లెవెల్స్ కూడా పెరిగిపోవడంతో బెంగుళూరులోని మాల్యా ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. దీంతో ఆమెకు సకాలంలో వైద్యం అందడంతో ఆరోగ్యం మెరుగైంది. అయితే పూర్తిస్థాయిలో కుదుటపడాలంటే మరికొన్నాళ్లు ట్రీట్ మెంట్ అవసరమని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికే హాస్పిటల్ బిల్ లక్షల్లోకి చేరింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆమె చెల్లెలు ఉషాదేవి దాతలను అభ్యర్థిస్తోంది. అమ్మకోసం అక్కదగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు అక్క ఆసుపత్రి పాలైంది. కన్నడ పరిశ్రమ ముందుకొచ్చి ఆదుకోవాలి అంటూ ఆమె కోరుతోంది. అయితే కన్నడ చిత్ర పరిశ్రమ చలించిపోయి ఆసుపత్రికి వెళ్లి విజయలక్ష్మిని పరామర్శించి ఆమెకు ఆర్ధిక సాయం అందించారు. ఆరోగ్యం కుదుటపడేదాకా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.