Politics

1990-2014 వరకు ఎన్నికల పొలిటికల్ ట్రెండ్ ఏమిటి….స్పెషల్ ఫోకస్

దేశం అంతా ఒక ఎత్తు ఎపి ఒక ఎత్తు అన్నట్టు వ్యవహారం నడిచేది. తెలుగుదేశం ఆవిర్భావంతో కాంగ్రెస్ ఏపీలో చిత్తుగా ఓడిపోతే,అదే టిడిపిని మళ్ళీ ప్రజలు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ని గద్దెనెక్కించారు. వెన్నుపోటు దారులన్నవాళ్లను అందలం ఎక్కించారు. కేసులున్నవాళ్లను అధికారంలో కూర్చోబెట్టారు. ఇక ఎపి రెండుగా విడిపోయాక తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ ట్రెండ్ వింతగా ఉంది. అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో గల తెలుగుదేశం,టిఆర్ ఎస్ లకు పచ్చగడ్డి వేస్తె ప్రస్తుతం భగ్గుమంటోంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే,గత ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి మళ్ళీ ఈసారి కూడా అధికారం దక్కించుకుని రెండోసారి కూడా నెగ్గిన చరిత్ర సృష్టించాలని ఆశిస్తోంది.

ఇక గత ఎన్నికల్లో కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం పొందాలని ప్రయత్నిస్తోంది. ఇక కొత్తగా వచ్చిన జనసేన కూడా ఈ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆపార్టీ నమ్మకంగా చెబుతోంది. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో మొత్తం 42ఎంపీ సీట్లకు గాను 1991ఎన్నికల్లో కాంగ్రెస్ 25సీట్లు దక్కించుకుని, 45.6శాతం ఓట్లు సాధించింది. నేషనల్ ఫ్రంట్ లో గల టిడిపి 13ఎంపీ సీట్లకు పరిమితం అవుతూ 32.32శాతం ఓట్లు సాధించింది.

ఎం ఐ ఎం , సిపిఐ సిపిఎం ఒక్కో సీటు దక్కించుకున్నాయి. ఇక 1996పార్లమెంట్ ఎన్నికల్లో 22ఎంపీ సీట్లను39.7శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది. టిడిపి32.6 శాతం ఓట్లతో 16ఎంపీ సీట్లు దక్కించుకుంది. సిపిఐ 2.4శాతం ఓట్లతో రెండు ఎంపీ సీట్లు సాధించింది. సిపిఎం ,ఎం ఐ ఎం లు చెరో సీటు దక్కించుకున్నాయి. 1998లో చూస్తే, 38.5శాతం ఓట్లతో 22ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. టిడిపి 32శాతం ఓట్లతో 12ఎంపీ సీట్లు దక్కించుకుంది. బిజెపి18.3శాతం ఓట్లతో నాలుగు ఎంపీ సీట్లు నెగ్గింది. ఎం ఐ ఎం ఒక సీటు , ఇతరులు ఒక సీటు గెలుపొందారు.

ఇక 1999ఎన్నికల్లో39.9శాతం ఓట్లతో టిడిపి ఘనవిజయం సాధించింది. 29ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. బిజెపి 7ఎంపీ సీట్లు గెలిచింది. కాంగ్రెస్ అత్యధికంగా 42.8శాతం ఓట్లు వచ్చినా, 5ఎంపీ సీట్లకు పరిమితం అయింది. ఎం ఐ ఎం ఒక సీటు దక్కించుకుంది. 2004ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యాజిక్ పనిచేసింది. టీఆరెస్ తో పొత్తుతో కాంగ్రెస్ పోటీచేసింది. కాంగ్రెస్41.6శాతం ఓట్లతో 29ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. 33శాతం తో 5ఎంపీ సీట్లకు టిడిపి పరిమితం అయింది. టీఆరెస్ 6.8శాతం ఓట్లతో 5ఎంపీ సీట్లు గెలుచుకుంది. సిపిఐ ,సిపిఎం లు చెరో ఎంపీ సీటు గెలుచుకున్నాయి.

ఇక 2009లో కూడా వైఎస్ మాజిక్ రిపీట్ అయింది. కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగితే,టీఆరెస్ ,టిడిపి,కమ్యూనిస్టులు మహాకూటమిగా బరిలో దిగాయి. అప్పుడు ప్రజారాజ్యం కూడా బరిలో నిల్చింది. విజయం కాంగ్రెస్ ని వరించింది. 39ఓట్ల శాతంతో 33ఎంపీ సీట్లు గెలిచింది. టిడిపి25ఓట్ల శాతంతో 6ఎంపీ సీట్లకు పరిమితం అయింది. టి ఆరేస్ 6శాతం ఓట్లతో రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఎం ఐ ఎం ఒక ఎంపీ సీటు దక్కించుకుంది. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఏపీలో 25ఎంపీ సీట్లు మిగిలాయి.

టిడిపి,బిజెపి,జనసేన కూటమిగా బరిలో దిగితే,జనసేన మాత్రం పోటీ చేయలేదు. టిడిపి,బిజెపి కలిపి17సీట్లు గెలిచాయి. టిడిపి 40.8శాతం ఓట్లు సాధించింది. బిజెపి కి 7శాతం ఓట్లు వచ్చాయి. వైసిపి సింగిల్ గా పోటీ చేసి,45.7శాతం ఓట్లు వచ్చినా 8ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి.