చిరంజీవి చేసిన తప్పే పవన్ చేస్తున్నాడా.. నాగబాబు తర్వాత ఎవరు..?
అదేంటి.. ఇప్పుడు ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారా..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి సెటైర్లే పేలుతున్నాయి మరి. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ లెక్కలు చూసి ఆహా ఓహో అనుకున్న వాళ్లే ఇప్పుడు నాగబాబు చేరిన తర్వాత ఇది కూడా మళ్లీ కుటుంబ పాలనకు తెరతీస్తుందని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ ఒంటరిగానే అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఎన్ని కష్టాలొచ్చినా కూడా కుటుంబాన్ని మాత్రం చేరువ కానీయలేదు. ఫలితం ఏదైనా తానే మోస్తానని చెప్పాడు పవర్ స్టార్.
ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన తప్పులను దగ్గరుండి చూసాడు కాబట్టి.. చచ్చినా ఒక్కర్ని కూడా తన పార్టీలోకి తీసుకోడని అంతా ఫిక్సైపోయారు కూడా. ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి నాగబాబు జనసేనలో కనిపించడంతో అభిమానులతో పాటు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అన్నయ్యను పార్టీలోకి తీసుకోవడం పవన్ చేసిన పెద్ద తప్పు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
తీసుకుంటే తప్పేంటని కొందరు పవన్ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుంటే.. ఇలా కుటుంబ పాలన చేసే కదా ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ మరికొందరు కారణాలు చూపిస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ కూడా మొదట్నుంచీ తాను కుటుంబ పాలనకు దూరం.. ప్రజా పాలనే తనకు కావాలంటూ మాటలు చెప్పాడు.
తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నాగబాబును పిలిచి సీట్ ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. నాగబాబు వస్తున్నపుడే వీటన్నింటికీ పవన్ కూడా సిద్ధపడ్డాడని అర్థమైపోతుంది. పైగా నాగబాబు కూడా తమ్ముడి పార్టీలో తాను ఫ్లోర్ తుడిచే పని ఇచ్చినా చేస్తానంటూ డైలాగులు చెప్తున్నాడు.
అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ ఉనికి మొత్తాన్ని లేకుండా చేసాయి. ఇప్పుడు అలాంటి తప్పులు జరక్కుండా ముందు నుంచి జాగ్రత్త పడుతున్న పవన్.. ఇప్పుడు నాగబాబు విషయంలో మాత్రం తప్పటడుగు వేసాడేమో అనే ప్రచారం జరుగుతుంది. పైగా తాను అందరిలాగా అడ్డదారులు ఉండవు.. నేరుగా ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి నిలబెడుతున్నాం.. గెలిస్తే పదవులు లేదంటే లేదు అంటూ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్.