Movies

అలనాటి హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు ఏ రంగంలో స్థిరపడిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సిమ్రాన్ అనగానే అందాల న‌టి.. అభిమానుల ఆరాధ్య దైవం అభిమానుల కళ్ళముందు కదలాడుతుంది. ఇటీవ‌ల ర‌జనీకాంత్ పేట సినిమాతో సిమ్రాన్ మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్‌ చేసింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం నటి త్రిష‌తో క‌లిసి సిమ్రాన్ నటిస్తున్న ఓ సినిమాకు సుమంత్ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హీరోయిన్‌గా ఒక‌ప్పుడు ఒక ఊపు ఊపేసి, త‌న అందం, అభిన‌యంతో ఆమె కుర్ర‌కారుకు మ‌త్తెక్కించింది. ఇటీవ‌ల ఓ భారీ సినిమాతో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ద‌శాబ్ద కాలం పాటు ద‌క్షిణాదిని షేక్ చేసిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ‌ మోడ్ర‌న్ లుక్‌తో ఎలాంటి పాత్ర‌లో అయినా ఇట్టే ఒదిగిపోయేది .

తెలుగులో దాదాపు అంద‌రు టాప్ హీరోల‌తో జతకట్టి హిట్స్ అందుకుంది. దక్షణాదిలో ఇంద్ర‌ప్ర‌స్థానం సినిమాతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే త‌మిళనాడు లేడీ సూప‌ర్ స్టార్‌గా నిల్చింది. ఎన్నోసార్లు ఫిల్మ్‌పేర్ అవార్డులు అందుకుని సిమ్రాన్ త‌న కెరీర్‌ను మలచుకుంది. 1976 ఏప్రిల్ 4న ముంబైలో అశోక్ నావెల్‌, శార‌ద నావెల్ దంప‌తుల‌కు జన్మించిన సిమ్రాన్ అస‌లు పేరు రుషి బాలా నావెల్. వాళ్ల‌ది పంజాబీ కుంటుంబం. ఆమెకు ఇద్ద‌రు చెల్లెలు, ఒక సోద‌రుడు ఉన్నారు.

బీకాం పూర్తి చేసిన‌ సిమ్రాన్‌, ఆ త‌ర్వాత మోడ‌లింగ్ రంగాన్ని ఎంచుకుని, అటునుంచి ఆమె బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. 1995లో స‌న‌మ్ హ‌ర్జాయ్ అనే హిందీ చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. న్యూజిలాండ్‌లో చిత్రీక‌ర‌ణ జరుపుకున్న మొద‌టి భార‌తీయ చిత్రం అదే కావ‌డం విశేషం. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద బొల్తాకొట్టింది. తొలి సినిమానే అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డంతో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మ‌య్యే సూపర్ హిట్ ముకాబలాష షో ‌కు యాంక‌ర్‌గా సిమ్రాన్ పనిచేసింది. ఆ స‌మ‌యంలో ఆ షోకు వ‌చ్చిన బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ భార్య జ‌యాబ‌చ్చ‌న్ త‌న ప్రొడ‌క్ష‌న్‌లో సిమ్రాన్‌కు హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చారు.

ఆ త‌ర్వాత ప‌లు హిందీ చిత్రాల్లో ఆమె న‌టించినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు.సిమ్రాన్ మళయాళ మూవీ ఇంద్ర‌ప్ర‌స్థానంతో ద‌క్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి, అనంత‌రం క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు చిత్రాల్లో న‌టించారు. సుమ‌న్ హీరోగా అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అప్ప‌ట్లో టాప్‌-4 మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ల‌కు జోడిగా అనేక చిత్రాల్లో చేసింది. ఆటో డ్రైవ‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, అన్న‌య్య‌, క‌లిసుందాం రా, నువ్వొస్తావ‌ని, డాడీ, యువ‌రాజు, గొప్పింటి అల్లుడు, ప్రేమ‌తో రా, సీత‌య్య వంటి బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాల‌లో తన న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ అయింది.

కోలీవుడ్‌లోనూ త‌న హవా కొన‌సాగించారు. ద‌క్షిణాదిలో సిమ్రాన్ దాదాపు 93 సినిమాల్లో యాక్ట్ చేశారు. కెరీర్ జోరు మీద ఉన్న‌ప్పుడే సిమ్రాన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె తన చిన్న‌నాటి మిత్రుడు దీప‌క్ భ‌గ్గాను 2003 డిసెంబ‌ర్‌లో పెళ్లాడింది. వీరికి ఆదిప్‌, ఆదిత్య అనే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. పెళ్లి త‌రువాత సిమ్రాన్ కొద్ది రోజులు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి, ఆ త‌ర్వాత కొన్ని సీరియ‌ల్స్ నటించింది.

జాక్‌పాట్ అనే త‌మిళ షోకు యాంక‌ర్‌గా కూడా పని చేసింది. 2008 బాల‌క్రిష్ణ స‌ర‌స‌న ఒక్క మ‌గాడు, కృష్ణ భ‌గ‌వాన్‌తో జాన్ అప్పారావ్ 40 ప్ల‌స్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ, సీరియ‌ల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది.