వరలక్ష్మి దేవికి ఇష్టమైన పువ్వులు,నైవేద్యాలు ఏమిటో తెలుసా?

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో  శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాడు  చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.శ్రావణమాసం మహిళలకు ఏంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడంవల్ల దీనిని వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.శ్రావణ మాసంలో లక్ష్మి దేవిని పూజిస్తాం. లక్ష్మి దేవికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతూ ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 

లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు మూడు. మందార పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి నిద్ర పడుతుంది. గన్నేరు పువ్వులతో పూజ చేస్తే బంగారం,వెండి కొనుగోలు చేయటం జరుగుతుంది. సన్నజాజి,మల్లె వంటి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలు తీరతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున పూజ  చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి నీలం రంగు పువ్వులను అసలు సమర్పించకూడదు. మిగతా రోజుల్లో నీలం పువ్వులతో పూజ చేయవచ్చు. కానీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అసలు నీలం పువ్వులతో పూజ చేయకూడదు. లక్ష్మీదేవికి పంచన్నములు అంటే మిక్కిలి ప్రీతి. వాటిలో మొదటిది దద్దోజనం- దద్దోజనంను అన్నంలో పెరుగు కలిపి తాలింపు వేసి తయారుచేస్తారు.

లక్ష్మీదేవికి దద్దోజనం నైవేద్యం పెడితే సంపదలు కలుగుతాయి. రెండోవది పరమాన్నం  – ఆవుపాలల్లో బియ్యాన్ని వేసి ఉడికించి వండాలి. ఆవుపాలతో తయారుచేసిన పరమాన్నంను నైవేద్యంగా పెట్టాలి. ఆవుపాలు ఎక్కువగా దొరక్కపోతే గేదెపాలల్లో కొంచెం ఆవుపాలు పోసి తయారుచేయవచ్చు. పరమాన్నంను నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరతాయి. మూడోవది పులిహోర – పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగటమే కాకుండా పుత్ర ప్రాప్తి కలుగుతుంది. 

నాల్గొవది – పులగం – బియ్యం,పెసరపప్పు కలిపి వండుతారు. ఈ పులగాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉంటారు. కుటుంబ వృద్ధి జరుగుతుంది. ఐదవది చక్కర పొంగలి – బెల్లంతో తయారుచేసిన ఈ అన్నాన్ని చక్కెరపొంగళి లేదా గుడాన్నమ్ అని అంటారు. చక్కర పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారు. ఆరోవది శనగలు ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే కొబ్బరి ముక్కలు,అరటి పండ్లు,దానిమ్మకాయ,పంపారు పనస,బత్తాయి కాయ  వంటి వాటిని కూడా నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేసి ఇష్టమైన నైవేద్యాలను నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి కృపకు పాత్రులు అయ్యి ఆనందంగా ఇస్తా ఐశ్వర్యాలతో ఉండండి.