Movies

శివుని పాత్ర తో అలరించిన హీరోలు

తెలుగులో పౌరాణిక చిత్రాలకు కొదవలేదు. ఒకప్పుడు రాముడు,కృష్ణుడు,అయ్యప్ప,వెంకటేశ్వర స్వామి,సాయి ఇలా ఎందరో దేవుళ్ళ గెటప్స్ తో సినిమాలు వచ్చాయి. ఇందులో శివుని పాత్ర కూడా ఎక్కువమంది వేశారు. అగ్ర హీరోలు శివుని గెటప్ తో దుమ్మురేపాడు. కృష్ణుడు రాముడు,వంటి పాత్రలే ఎక్కువగా వేసిన నందమూరి తారకరామారావు దక్ష యజ్ఞం మూవీలో శివుడి పాత్ర వేసారు. అలాగే ఉమా చండీ ,గౌరీ శంకరుల కథ వంటి సినిమాల్లో కూడా పరమశివుని పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఎక్కువగా సాంఘిక చిత్రాలే చేసిన అక్కినేని నాగేశ్వరరావు మూగమనసులు మూవీలో గౌరమ్మ నీ మొగుడేవరమ్మా పాటలో రెండు మూడు సార్లు శివుని గెటప్ లో కనిపిస్తారు.

బ్లాక్ అండ్ వైట్ సినిమాల సమయంలోనే లవర్ బాయ్ గా వెలిగిన అందాల నటుడు శోభన్ బాబు కూడా శివుని పాత్ర వేసాడు. ఎన్టీఆర్ నటించిన పరమానందయ్య శిష్యుల కథ మూవీలో శివుని గెటప్ లో శోభన్ బాబు అలరించాడు. ఇక రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా శివుడి గెటప్ తో అలరించాడు. కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన వినాయక విజయం సినిమాలో శివుడి పాత్రతో మెప్పించాడు. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న రావు గోపాలరావు మా ఊళ్ళో మహాశివుడు సినిమాలో శివుడి పాత్రలో మెప్పించాడు.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి శివుడి పాత్రల్లో మెప్పించాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన శ్రీ మంజునాథ మూవీలో మెగాస్టార్ చిరంజీవి శివుని పాత్రలో తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. అంతకుముందు కె విశ్వనాధ్ సినిమా ఆపద్భాంధవుడు మూవీలో ఓ పాటలో శివుని వేషంలో మెగాస్టార్ కనిపించి అలరించాడు. పెళ్ళైన కొత్తలో సినిమాలో జగపతి బాబు శివుడు పాత్రలో మెరిసి మెప్పించాడు. మన్మథుడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున జగద్గురు ఆది శంకర మూవీలో శివుడు పాత్రలో నటించి మెప్పించాడు. శ్రీకాంత్,ప్రకాష్ రాజ్,సుమన్ తదితరులు కూడా శివుడి వేషంలో మెప్పించారు.