లాక్ డౌన్ రివ్యూ : ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ – (నెట్ ఫ్లిక్స్ )

నటీనటులు : జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మనోజ్ బాజ్‌పాయ్, మోహిత్ రైనా, జైన్ మేరీ
దర్శకుడు : శిరీష్ కుందర్
నిర్మాతలు : ఫరా ఖాన్, శిరీష్ కుందర్
ఛాయాగ్రాహకులు : రవి కె. చంద్రన్, కిరణ్ డియోహన్స్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన సినిమా ‘మిసెస్ సీరియల్ కిల్లర్’. శిరీష్ కుందర్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :
మృత్యుంజయ ముఖర్జీ (మనోజ్ బాజ్‌పాయ్) ఉత్తరాఖండ్‌లోని ఒక హిల్ స్టేషన్‌లో ప్రసిద్ధ గైనకాలజిస్ట్, కాగా అతను షోనా (జాక్వెలిన్ ఫెర్నాండెజ్)ను వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఒక రోజు, మృత్యుంజయ వేరే సిటీలో ఉన్న సమయంలో షోనా తానూ గర్భవతి అని అతనికి చెబుతుంది. మృత్యుంజయ ఎంతో సంతోషిస్తాడు. తిరిగి తన ఇంటికి వచ్చే సమయానికి, పోలీస్ ఇమ్రాన్ (మోహిత్ రైనా) మృత్యుంజయ ఇంటికి వచ్చి.. మృత్యుంజయ ఓ సీరియల్ కిల్లర్ అని ఆ ఇంట్లో కొన్ని ఆధారాలను సేకరిస్తాడు. షోనా షాక్ అవుతుంది. మృత్యుంజయను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత షోనా తన భర్త సీరియల్ కిల్లర్ కాదని నిరూపించడానికి ఏం చేసింది ? అతన్ని జైలు నుండి బయటకు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? అనేదే మిగిలిన కథ.

ఏం బాగుంది :
ఏమి బాగాలేదు అనే చెప్పుకోవాలి. అయితే మనోజ్ బాజ్‌పాయ్ నటన అద్భుతంగా అనిపిస్తోంది. అలాగే షోనా పాత్రలో దాగి ఉన్న లోతైన భావోద్వేగాలను ఎక్స్ ప్రెస్ చేసే సన్నివేశాల్లో అతని నటన బాగా ఆకట్టుకుంటుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఏం బాగాలేదు :
బాలీవుడ్ లో ప్రఖ్యాత నటీనటులు నటించినప్పటికీ స్క్రిప్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో నటులు కూడా ఆ ఫీల్ ను తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలో కనిపించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేలవంగా వ్రాసిన పాత్రలో నటించింది. పైగా పాత్రల మధ్య బలమైన సంఘర్షణకు అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కడా ఆ అవకాశాన్ని ఊపయోగించుకోలేదు. దీనికి తోడు ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే డ్రామా రీచ్ అయ్యేది. అసలు దీనిలో నటించిన ప్రతి నటుడు ఏం నచ్చి వారు నటించడానికి ఎందుకు అంగీకరించారో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

చివరి మాటగా :
గతంలో జోకర్, జాన్-ఇ-మన్ వంటి హిందీ చిత్రాలను నిర్మించిన శిరీష్ కుందర్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ పరంగా కామెడీని మిస్టరీతో కలపడం అస్సలు సెట్ అవ్వలేదు. వాస్తవానికి, ప్రతి సన్నివేశం చాలా పేలవంగా, నటీనటుల ఓవర్ యాక్టింగ్ తో పాటు, పూర్తి అనుకరణలా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోదు.