ఇప్పుడు వెటరన్ హీరోల షూటింగులకు ఇబ్బందేనా…?

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ కారణంగా అన్నింటితో పాటే సినిమా పరిశ్రమ కూడా మూతబడింది. అసలు ఇలాంటి రోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అయితే ఒక్కొక్కటి సడలింపులు వస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగులు త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. జూన్ లోనే షూటింగులు మొదలు పెడతారనేది తెలుస్తున్నా, కరెక్ట్ గా ఏ తేదీ నుంచి షూటింగులు మొదలవుతాయని ఇంకా క్లారిటీ ఇవ్వాలి. ఈనేపధ్యంలో జూన్ పది నుంచి అనుమతులు ఇస్తారని ఇప్పటికే ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే షూటింగుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తుందని, ఎవరెవరు షూటింగ్ చేస్తున్నారో ఆ వివరాలు ప్రభుత్వానికి అందించాల్సి ఉందట. అయితే ఒక విషయంలో ఫిలింమేకర్లకు చిక్కులు తప్పకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. అదేంటంటే మహమ్మారి కారణంగా బయట తిరగడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు.. అరవై ఏళ్ళ వయసు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని.. ఇంట్లోనే ఉండాలని.. బయటకు రాకూడదని ప్రభుత్వం చెప్తోంది.

అయితే మన ఫిలిం ఇండస్ట్రీ లో చాలా మంది సూపర్ సీనియర్ హీరో లందరి వయసు 60 కి పైమాటే. తెలుగులో అయితే చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. వెంకటేష్ ఇలా అందరూ 60 లలో ఉన్నారు. ఇక తమిళంలో రజనీకాంత్.. కమల్ హాసన్ కూడా సిక్స్టీ ప్లస్ హీరోలే. ఒకవేళ 60 ఏళ్ళ వయసు పైబడిన వారు షూటింగులలో పాల్గొనకూడదనే నిబంధన పెడితే ఈ స్టార్ హీరోలందరూ షూటింగులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలా జరిగితే వ్యాక్సీన్ వచ్చేంతవరకూ ఈ హీరోలతో ప్లాన్ చేసిన సినిమాల షూటింగ్ అనుమానమే. ఒకవేళ ‘మీ ఆరోగ్యం మీ బాధ్యత’ అని చూసి చూడనట్టుగా వదిలేయొచ్చనే మాట కూడా వినిపిస్తోంది.