Health

ఈ జ్యూస్‌తో బెల్లీఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చు!

మునగలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగకాడలే కాదు, ఆకుల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యంతోపాటు అధిక బరువును తగ్గించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మునగాకులు సహాయపడతాయి. అధిక మొత్తంలో పోషకాలు లభించే ఆహార పదార్థాల్లో మునగాకులు ముందు స్థానంలో ఉంటాయి. మునగ ఆకు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడమే కాదు, రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. రక్తంలోని అధిక చక్కెరలను నియంత్రించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది.

అంతే కాదు పెద్ద పేగులను కూడా శుభ్రం చేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది. మునగ ఆకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. కాలేయం, మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. పొటాషియం అరటి పళ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్ ఎ, కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి.

రక్తపోటును నియంత్రించి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, గౌట్స్ లాంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాదు చర్మంలోని మృత‌ కణాలను తొలగించి మృదువుగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల సమతౌల్యతను కాపాడి, కండరాల వాపు తగ్గించి, మంచి కొవ్వును అందిస్తుంది. అలెర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కేన్సర్ కణాలతో పోరాడి ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార, అండాశయ కేన్సర్లను నిరోధిస్తుంది. మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచుతుంది.

ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు బలంగా తయారవుతాయి. బాలింతలు తీసుకుంటే తల్లిపాలు పిల్లలకు పుష్కలంగా అందుతాయి. థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ చర్యలను అదుపులో ఉంచుతుంది. దీనిలో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, క్యాల్షియం, తక్కువ పరిమాణంలో కొవ్వు శరీరానికి సహజమైన శక్తిని అందిస్తాయి. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో మునగాకు రసం సాయపడుతుంది. దీని వల్ల లివర్ పనితీరు సక్రమంగా ఉంటుంది.