రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేయటం అవసరమా?

Brush your teeth every night : రాత్రివేళల్లో నిద్రపోయినా సరే… తప్పనిసరిగా బ్రష్ చేసుకుని పడుకోవాలి. నిజానికి పగటివేళ కంటే రాత్రివేళల్లోనే నోటిలో సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతుంటాయి.

మనమంతా ఉదయం లేవగానే బ్రష్షింగ్ చేసుకుంటాం. కానీ… మనలో చాలామంది రాత్రివేళ బ్రష్షింగ్ చేసుకోరు. ఉదయం చేసుకున్న బ్రష్షింగ్ చాలనుకుంటారు.

అయితే మన దేశంలో మారుతున్న పరిస్థితులను బట్టి నైట్ బ్రష్షింగ్ అవశ్యకత పెరుగుతోంది.

చాలా మంది ఇప్పుడు రాత్రివేళ తీసుకునే జంక్‌ఫుడ్ వైపునకు మళ్లుతున్నారు. రాత్రివేళల్లోనూ మెలకువతో ఉండి ఏదో ఆహారాన్ని నములుతూ టీవీ చూడటం, ఏదో ఒకటి పంటి కింద నలిపేస్తూ పనిచేసుకుంటూ ఉండటం, రాత్రి వేళల్లో కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వంటివి చేస్తున్నారు. ఈ మారిన వేళలు, ఆహారపు అలవాట్ల ఫలితంగా రాత్రి బ్రష్షింగ్ అవసరం పెరుగుతోంది.

రాత్రివేళల్లో నిద్రపోయినా సరే… తప్పనిసరిగా బ్రష్ చేసుకుని పడుకోవాలి. నిజానికి పగటివేళ కంటే రాత్రివేళల్లోనే నోటిలో సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతుంటాయి. రాత్రిపూట నోటిలో లాలాజలం తక్కువగా ఉంటుంది. అందువల్ల క్రిముల పెరుగుదల పెరిగి దంతాలకు హానికరమైన ఆసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

పైగా నిద్రపోతున్నప్పుడు పెరిగే క్రిములు నిద్ర వేళల్లో నోరుమూసుకుని ఉన్నందువల్ల చాలాసేపు అక్కడే నివసిస్తాయి. పైగా ఎక్కువగా వృద్ధిచెందుతుంటాయి. అందువల్ల నోటి అనారోగ్యం కలిగేందుకు పగటివేళ కంటే రాత్రి పూటే అవకాశాలు ఎక్కువ. అందుకే రాత్రి ఏమీ తినకపోయినా, నిద్రపోతూ ఉన్నా సరే… పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం అవసరం.

ఐదేళ్ల పిల్లల్లో దంత సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎందుకంటే… ఇప్పుడు పిల్లలు గతంలో కంటే ఎక్కువగా బర్గర్లు, పిజ్జాలు, క్యాండీస్, చాకొలెట్స్, కోలాడ్రింక్స్ వంటి ఎక్కువ జిగురైన, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు.

దాంతో పిల్లల్లో దంతసమస్యలు మరింత పెరుగుతున్నాయి రాత్రివేళల్లో ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది కేవలం పుక్కిలించి వదిలేస్తుంటారు. పుక్కిలించడం వల్ల అక్కడక్కడ ఉన్న ఆహారం మాత్రమే తొలగిపోతుంది. అంతేగాని… దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం కేవలం పుక్కిలించడం వల్ల పోదు.

అందుకే రాత్రి బ్రష్షింగ్ ఇప్పుడు అవసరం. పై కారణాలను దృష్టిలో ఉంచుకుని గతంలో మీకు అలవాటు లేకపోయినా… ఇప్పట్నుంచి ఉదయం లాగే రోజూ రాత్రి వేళల్లోనూ బ్రష్ చేసుకుంటూ ఉండండి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.