‘టక్ జగదీశ్’ ఓటీటీ లో రిలీజ్ కి భారీ ఆఫర్…ఎన్ని కోట్లో…?

Nani Tuck Jagadish Movie :నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీశ్’ మూవీకి కరోనా ఎఫెక్ట్ కొట్టింది. మొదటి వేవ్ ముగిసి థియేటర్లు తెరుచుకున్నప్పుడు కరోనా సెకండ్ వేవ్ కు కాస్త ముందు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసారు. అయితే,సెకండ్ వేవ్ ప్రభావం, తదనంతర అనూహ్య పరిణామాలతో ఈ మూవీ రిలీజ్ కి నోచుకోలేదు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు ఆడియన్స్ కూడా వచ్చే ఛాన్స్ లు తక్కువ. దీనికి తోడు థర్డ్ వేవ్ భయం కూడా వెంటాడుతోంది.

ఇలాంటి సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫాంకు అప్పజెప్పేస్తే మంచిదన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ మూవీని ఓటీటీ ప్లాట్ ఫాం మీద విడుదల చేసేందుకు వీలుగా డీల్ చేసుకున్నారట. శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రముఖ ఓటీటీ అమెజాన్ సంస్థ నుంచి వచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ కు నిర్మాతలు ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఇక హీరో నానికి,నిర్మాతలకు మధ్య చర్చలు నడుస్తున్నాయట.

ఈ మూవీని ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేయడానికి 42 కోట్లకు డీల్ కూడా కుదిరినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విక్టరీ వెంకటేష్ నారప్ప కూడా ఓటీటీ అమెజాన్ సంస్థ రిలీజ్ చేసింది. ఇప్పుడు నాని ‘టక్ జగదీశ్’ డీల్ కూడా ఒకే అయితే మరిన్ని సినిమాలు అదే పడతాయన్న మాట వినిపిస్తోంది. గతంలో నాని విలన్ గా చేసిన వి మూవీ కూడా ఓటీటీ లోనే రిలీజయింది.