మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు

పల్లెటూర్లలో పొలాల గట్ల వెంట,మైదాన ప్రాంతాల్లో ఇంటి పెరట్లో, మన ఇంటి చుట్టుపక్కల పెరిగే ఈ గడ్డి చామంతి మొక్కను పిచ్చి ముక్క అని అనుకుంటాం. కానీ ఈ మొక్క గురించి తెలిస్తే మీరు కూడా ఇంటిలో పెంచుకుంటారు. ఈ గడ్డి చామంతి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గడ్డి చామంతిని ప్రాంతాన్ని బట్టి వైషాలకర్ణి, పలక ఆకు,గాయపాకు, రావణాసుర తల అని పిలుస్తారు.

ఈ మొక్క సుమారు రెండు అడుగుల పొడవు ఉండి రెమ్మలు నలువైపులా పాకుతాయి. ఈ మొక్క శాస్త్రీయ నామం ట్రైడాక్స్‌ ప్రొకంబన్స్‌. ఇంగ్లీషులో మెక్సికన్‌ డైసీ, కోట్‌ బట్టన్స్‌ అని పిలుస్తారు. హిందీలో ఘమ్రా, సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు. ఈ మొక్కలు గుంపు గుంపుగా వందల సంఖ్యలో కన్పిస్తాయి. పల్లెటూరి వారికీ ఈ మొక్క గురించి బాగా తెలుసు. ఈ మొక్కను పురాతన కాలం నుండి వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

గడ్డి చామంతిని పలక ఆకు అని పిలవటానికి ఒక కారణం ఉంది . చిన్నతనంలో మట్టి పలకలు ఉండేవి కదా. ఆ పలకలను ఈ గడ్డి చామంతి ఆకులతో రుద్దితే కొత్త పలకల వలె మెరిసిపోయేవి. అందుకే పలకా ఆకు అని పేరు వచ్చింది. తెలంగాణలో ఈ గడ్డి చామంతిని నల్లారం అని పిలుస్తారు. పొలాల్లో పనిచేసే వారికి గాయాలు అవ్వటం సహజమే. ఆలా గాయాలు అయ్యినప్పుడు ఈ గడ్డి చామంతి ఆకులను నలిపి గాయాలు అయినా ప్రదేశంలో ఉంచితే రక్తస్రావం వెంటనే ఆగిపోవటమే కాకుండా గాయాలు కూడా తొందరగా నయం అవుతాయి.

దాంతో గడ్డి చామంతికి గాయపాకు అని పేరు వచ్చింది. ఆస్టరేసియో అనే పొద్దు తిరుగుడు పువ్వు కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో, ప్రస్ఫుటపు రంపపు అంచులు ఉంటాయి. ఇవి చిన్ని చామంతి పూలలాసన్నని కాడలపై లేత పసుపు రంగులో పూస్తాయి. గడ్డి చామంతిలో ఆల్కలాయిడ్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు. వీటికి తోడు సోడియం, పొటాషియం, కాల్షియం కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. గడ్డి చామంతి ఆకులకు యాంటీ సెప్టిక్ లక్షణాలు మరియు అయోడిన్ ఉండుట వలన గాయాలకు ఈ రసాన్ని రాస్తే గాయాలు తొందరగా నయం అవ్వటమే కాకుండా రక్తస్రావం కూడా ఆగుతుంది.

ఈ ఆకురసం దగ్గు,ఆయాసం వంటి వాటికీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ గడ్డి చామంతి ఆకురసంలో ఒక స్పూన్ తేనే కలిపి తీసుకుంటే దగ్గు,ఆయాసం తగ్గుతాయి.గడ్డి చామంతి ఆకురసం చర్మ వ్యాధుల సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. గజ్జి,తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టిన గడ్డి చామంతి ఆకుల పొగ పెడితే దోమలు పారిపోతాయి. గడ్డి చామంతిలో జోలియోలోనిక్‌ అనే రసాయనం ఉండటం వలన మధుమేహం నియంత్రణలో సహాయాపడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.