శనీశ్వరుడికి ఎలాంటి నూనెతో పూజ చేస్తే మంచిదో తెలుసా ?

shani dev : ఏలిన నాటి శని, శనిగ్రహ ప్రభావం ఇలా చాలా చెబుతూ ఉంటారు. అయితే శనీశ్వరుని అనుగ్రహం పొంది గ్రహ పీడలు వదిలించుకోవాలంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుంటారు. ముఖ్యంగా శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం అలాగే శనిత్రయోదశి నాడు పూజలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా శనీశ్వరుడిని ఆవ నూనెతో పూజచేయడం కూడా ఎక్కువగా కన్పిస్తుంది.

కొంతమంది శనీశ్వరుడికి ఆవ నూనెతో అభిషేకం చేస్తే, కొంతమంది ఆవనూనె దీపాన్ని వెలిగిస్తారు. అయితే శనీశ్వరుడికి ఆవనూనె ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే, రామాయణ కాలంలో ఒకసారి.. శనీశ్వరుడు తన బలం, శక్తిని గురించి తలచుకుని గర్వించే, సమయంలో హనుమంతుడి పరాక్రమం 4 దిక్కులకూ వ్యాపించింది.

హనుమంతుని శక్తి గురించి తెల్సి కూడా శనీశ్వరుడు యుద్ధానికి దిగుతాడు. అయితే అదే సమయంలో శ్రీరాముణ్ణి భక్తితో హనుమంతుడు ధ్యానం చేస్తుంటాడు. అయినా సరే, హనుమంతుడిని తనతో యుద్ధం చేయమంటూ శని సవాల్ చేస్తే, హనుమంతుడు వద్దంటాడు. అయినా సరే, ససేమిరా అంటాడు శనీశ్వరుడు.

దీంతో ఇద్దరూ యుద్ధానికి దిగడం, అది భీకర యుద్ధానికి దారితీయడం చివరకు శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా హనుమ దెబ్బలకు శరీరమంతా గాయాలై, నొప్పితో బాధపడడం జరుగుతాయి. అప్పుడు శనీశ్వరుడి దెబ్బలకు హనుమంతుడే స్వయంగా ఆవనూనె రాయడంతో ఒళ్ళు నొప్పులు, దెబ్బలు మటు మాయం అవుతాయి. ఇక అప్పటి నుంచి శనీశ్వరునికి భక్తులు తమ గ్రహ పీడ బాధలనుంచి విముక్తి కోరుతూ ఆవనూనెతో అభిషేకం చేయడం, దీపాలు వెలిగించడం ఆనవాయితీగా మారింది.